BRS leaders Protests against Congress : బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఉచిత విద్యుత్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రైతు వేదికలపై బీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో రైతువేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. 24 గంటలు కరెంటు ఇచ్చే బీఆర్‌ఎస్ సర్కార్ కావాలో తేల్చుకోవాలని రైతులకు సూచించారు.
BRS ministers fires on Revanth Reddy : మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంటే కడుపు మండుతోందని ఆయన మండిపడ్డారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లిలో నిరసనలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొని.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. వ్యవసాయాన్ని దెబ్బ తీసిందే కాంగ్రెస్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రేవంత్ క్షమాపణలు చెప్పేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
"రైతులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇవాళ రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా.. మూడు పంటల బీఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలో ఆలోచించుకోవాలి. సంవత్సరానికి ఎకరానికి రూ.10 వేలు ఇచ్చే ప్రభుత్వం కావాలో.. పైసా ఇవ్వని కాంగ్రెస్ కావాలో నిర్ణయించుకోవాలి".- శ్రీనివాస్ గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
"రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పనంత వరకు ఉద్యమిస్తాం.. ఇంకా రైతులను ఏకం చేస్తాం. మరో ఎనిమిది రోజులు ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ నేతలు కుడా ఆలోచించి రేవంత్ రెడ్డితో రైతులకు క్షమాపణ చెప్పించాలి."- ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం నుంచి వెంకటాపురం వరకు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. అవగాహన లేకుండా ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు కేసీఆర్ ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టలేదని తెలిపారు. సుమారు రూ.10,500 కోట్లు ఉచిత విద్యుత్ మీద ఖర్చు చేస్తున్నామని వివరించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని శివునిపల్లి రైతు వేదిక నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రైతులకు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికల వస్తున్న తరుణంలో 'మూడు గంటల కాంగ్రెస్ కావాలా.. మూడు పంటల బీఆర్‌ఎస్ కావాలా.. వెలుగులు విర జిమ్మే బీఆర్‌ఎస్ కావాలా.. కారు చీకట్ల కాంగ్రెస్ కావాలా' అనేదే తమ పార్టీ నినాదమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: