BRS Kisan cell will start in 6 states by the end of December: భారత రాష్ట్రసమితి కార్యకలాపాలు నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ధనుర్మాసం ప్రారంభమవుతుందన్న ఉద్దేశంతో ఆ లోపే పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి దిల్లీలో వేదిక సిద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్న అతికొద్ది సమయంలోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టు పేర్కొన్నాయి. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అన్న నినాదంతో ముందుకు పోవాలని పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్‌లో ప్రకటించిన అధినేత కేసీఆర్.. అందుకు అనుగుణంగా ముందస్తుగా ఆరు రాష్ట్రాల్లో పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్ సమితి విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించారు. క్రిస్మస్ పండగ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలు అవలంభించాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ ఆదిశగా నేతలను సమాయత్తం చేస్తున్నారు. నెలాఖరు కల్లా పంజాబ్, హరియాణా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారాస కిసాన్ సెల్‌లను ప్రారంభిస్తారని పార్టీ నేతలు తెలిపారు.
ఏపీలోని ఆరు జిల్లాల్లో బీఆర్‌ఎస్ ప్రారంభానికి రంగం సిద్ధం
క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి భారాస కార్యకలాపాల ఉద్ధృతి పెరగనుందని, ముందుగా ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకాలాపాలు ప్రారంభం కానున్నట్టు చెప్పారు. తద్వారా జాతీయ స్థాయిలో భారాస తన వాణి వినిపిస్తూ .. దేశ ప్రజలను ఆకర్షిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి పలు ఇతర రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ నాయకులను ఆకర్షిస్తోందని.. భారాసలో పనిచేసేందుకు తమకు అవకాశం కల్పించాలని పలువురు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకొని కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని నేతలు చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ను ప్రారంభించడానికి రంగం సిద్ధమైనట్టు తెలిపారు.
ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల నుంచి ఇప్పటికే 70.. 80మంది ప్రముఖులు కేసీఆర్‌ను సంప్రదించినట్టు నేతలు చెప్పారు. అధినేత ప్రకటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని నేతలు తెలిపారు. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఉత్సాహం చూపుతున్నట్టు తెలిపారు. భారాస భావజాల వ్యాప్తి కోసం ఆయా స్థానిక భాషల్లో పాటలు, సాహిత్యం సిద్ధం చేస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా తదితర భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. భారాస కార్యాచరణ, సిద్ధాంతాలు, విధి విధానాలను నెలాఖర్లో అధినేత కేసీఆర్ దిల్లీ వేదికగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం దిల్లీ వేదికగా జాతీయస్థాయి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: