KTR Special Interview: దేశంలో ఎక్కడ ప్రతిపక్ష ప్రభుత్వం ఉంటే అక్కడికి వెళ్లి.. ఇది అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపణలు చేయడం దిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేఘాలయలో కాన్రాడ్ సంగ్మాతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారని.. ఎన్నికల సమయంలో విడిపోగానే కాన్రాడ్ సంగ్మా అత్యంత అవినీతి ముఖ్యమంత్రి అంటూ పీఎం మోదీ, అమిత్‌షాలు తీవ్ర ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. వారం రోజులు తిరగకుండానే మళ్లీ సంగ్మా ప్రభుత్వంలోనే బీజేపీ చేరిందని తెలిపారు. కాన్రాడ్ ప్రమాణ స్వీకారానికి మోదీ, అమిత్ షాలు హాజరయ్యారని.. ఇదీ వాళ్ల వ్యవహారమని దుయ్యబట్టారు. కర్ణాటకలో 40 శాతం కమీషన్ ప్రభుత్వమని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని మంత్రి వివరించారు.
అవే అస్త్రంగా ఎన్నికల బరిలోకి..: సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి రాష్ట్రం నమూనాగా కనిపిస్తోందని కేటీఆర్ వివరించారు. 3 శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. దేశంలో 30 శాతం పంచాయతీ అవార్డులు గెలుచుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పని తీరుకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుందన్నారు. 9 ఏళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరు, అందుకు ప్రజలు ఇచ్చిన మెచ్చుకోలు.. అన్నీ ప్రజల ముందు పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. వీటి ప్రాతిపదికన మళ్లీ తమకే ఓటు వేయాలని అడుగుతామని.. కేంద్రం ఏ విధంగా విఫలమైందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. 27న పార్టీ ప్లీనరీలోనూ అదానీ రూపంలో తారాస్థాయికి చేరుకున్న అవినీతి, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా నిత్యావసర ధరల పెరుగుదల తదితర అంశాలను చర్చకు పెడతామని వివరించారు.
ప్రజల ఆశీర్వాదం 100 శాతం మాకే..: సామాన్య ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి మంచి చేసిందని.. ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దక్షత కలిగిన కేసీఆర్ లాంటి నాయకుడి వల్ల రాష్ట్రంలో ప్రజల సంపద పెరుగుతోందని వివరించారు. ప్రజల కోసం ఇన్ని చేస్తున్న తమ ప్రభుత్వానికే ఈ ఎన్నికల్లోనూ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్‌తోనే..: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌తోనే పోటీ ఉంటుందని కేటీఆర్ వివరించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్సే రెండో స్థానంలో ఉందని.. అది కూడా సుదూరంగా ఉంది తప్ప తమ పార్టీకి దగ్గరగా లేదని తెలిపారు. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు వల్ల ఆ పార్టీ రోజురోజుకూ తీసికట్టుగా తయారవుతోందని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో 19 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీకి.. ఈ ఎన్నికల్లో అవి కూడా రావని జోస్యం చెప్పారు. మరోవైపు.. బీజేపీ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ, సమాజంలో తక్కువ అని ఎద్దేవా చేశారు. పైపై బిల్డప్ తప్ప ఆ పార్టీలో ఏమీ లేదన్నారు.
బీజేపీ నేతలపై మాట్లాడితే దాడులు..: బీజేపీ నేతలపై ఎవరు మాట్లాడితే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేయాల్సిందేనని.. అయితే ఈ 9 ఏళ్లలో ఒక్క బీజేపీ నాయకుడిపైనా ఐటీ, సీబీఐ, ఈడీ సంస్థలు దాడి చేసిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ నేతలంతా సత్య హరిశ్చంద్రుడి కజిన్ బ్రదర్స్ అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఆ పార్టీ నేతలు తప్ప ఇతరులు అంతా అవినీతి పరులు, దుర్మార్గులా అని ప్రశ్నించారు. అదానీ వంటి ఒక్కడికి కొమ్ముకాయడం వల్ల ప్రస్తుతం దేశమంతా దివాలా తీయించే రోజు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం పండినప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
కొత్తగా ఏం చేయాలనుకుంటున్నామంటే..: రానున్న రోజుల్లో మెట్రో రెండో దశ, ఎయిర్‌పోర్టు మెట్రో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని గట్టి సంకల్పంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రోను 250 కిలోమీటర్లు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నామన్న ఆయన.. ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆర్టీసీలో పూర్తిగా విద్యుత్ బస్సులనే ప్రవేశపెట్టాల్సి ఉందని.. వీటితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఇంకా పెద్ద ఎజెండా ఉందని వివరించారు.
ఇవీ చూడండి..
KCR Interesting Comments: మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదు: కేసీఆర్