BRS Election Campaign : హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్(BRS) నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైతుబంధు, దళితబంధు సహా.. సంక్షేమ పథకాలను విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తూ ఓట్ల వేట సాగిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో.. పోచారం శ్రీనివాస్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు.
Telangana Assembly Elections 2023 : మూడవసారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేనిఫెస్టోలో(BRS Manifesto) ప్రకటించిన హామీలన్నింటిని అమలు చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి, పుల్పోపోనిపల్లి, ఇబ్రహీంబాద్, తిరుమలగిరి గ్రామాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధికి మారుపేరైన అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భారీ మెజారిటీ ఇచ్చి పట్టం కట్టాలని.. ఈవీఎంలో మూడో నెంబర్లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మంలోని పువ్వాడ అజయ్ కుమార్ నిర్వహించిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ప్రచారం నిర్వహించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విపక్షాలపై విమర్శలు గుప్పించారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ రూరల్ మండలంలో మంత్రి గంగుల కమలాకర్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. పదేళ్ల స్వయం పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని వెల్లడించిన గంగుల.. ప్రతిపక్షాలకు అవకాశమిస్తే ఆగమైపోతామని హెచ్చరించారు.
హైదరాబాద్ వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్ - ఓటు ఎక్కడ వేస్తారో తెలియక టెన్షన్ టెన్షన్
BRS Candidates Election Campaign : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, బొమ్మకల్, గొడిశాల, నల్లనిరామయ్య పల్లి, గుజ్జులపల్లి, ఎల్లంపల్లి గ్రామాలలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మంగళహారతులు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలతో మహిళలు, యువకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలో పాడి కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రచారం నిర్వహించారు. కౌశిక్ రెడ్డి నృత్యాలతో హోరెత్తించగా.. ఆయన భార్య మహిళలకు బొట్టు పెట్టి ఓట్లభ్యర్థించారు. జగిత్యాల జిల్లాలో డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోసండ్ర వెంకట వీరయ్య రోడ్‌షో నిర్వహించారు. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లెందులో హరిప్రియ కారు గుర్తుకే ఓటేయాలని కోరారు.
రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు, రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయి : కేసీఆర్