TAUK: లండన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) సంస్థను బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ అభినందించారు. గతేడాది అక్టోబర్‌లో లండన్‌లో జరిగిన బతుకమ్మ, దసరా వేడుకల్లో సామాజిక బాధ్యతతో టాక్ సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వారియర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం- ప్రభలత దంపతుల కుమార్తె నిత్య శ్రీ కూర్మాచలం.. టాక్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల విషయాలను, నేషనల్ హెల్త్ సర్వీస్ యునైటెడ్ కింగ్డమ్ (NHSUK) ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని వివరిస్తూ.. బ్రిటన్ మహారాణికి లేఖ రాశారు.
మహారాణి అభినందనలు..
నిత్యశ్రీ రాసిన లేఖకు బ్రిటన్ మహారాణి కార్యాలయం స్పందించింది. మహారాణి బతుకమ్మ వేడుకల ఫొటోలను చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా వేడుకల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ (NHSUK) ప్రపంచవ్యాప్త కొవిడ్ వారియర్స్‌కి కృతజ్ఞతలు తెలపడం పట్ల టాక్ సంస్థ కృషిని అభినందించినట్టు తెలిపింది. ఈ విషయాన్ని మహారాణి దృష్టికి తీసుకొచ్చిన నిత్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు.
బ్రిటన్ మహారాణి కృతజ్ఞతలు తెలపడం పట్ల టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మహారాణికి చేరవేసిన నిత్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్న టాక్ సంస్థ సభ్యుల పనితీరును కొనియాడారు. ఇకపై రెట్టింపు ఉత్సాహాంతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: Harish Rao Allegations on BJP: ఉద్యోగులపై భాజపాది కపట ప్రేమ : హరీశ్