తిరుపతి అక్కారంపల్లికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం... కుటుంబంతో కలిసి వినాయక్ సాగర్ రాధేశ్యాం అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు. సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తిలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా... మధులత గృహిణి. చిన్నారి హాసినీ స్థానిక సర్పింగ్ డేల్ స్కూల్ ఏడో తరగతి చదువుతోంది. ఐదు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో కలిపేందుకు రెండు రోజుల క్రితం తన భార్య మధులత, 12ఏళ్ల కుమార్తె హాసినితో కలిసి సుబ్రహ్మణ్యం పాపికొండలకు వెళ్లారు.
గోదావరిలో తండ్రి ఆఖరి క్రతువును నిర్వహించేందుకు వెళ్లిన ఆ కుటుంబం... తిరిగి తమ బంధువులను భయాందోళనల్లో ముంచేసింది. పడవ ప్రమాదంలో దుర్గం సుబ్రహ్మణ్యం కుటుంబం నీటిలో మునిగిపోయింది. సుబ్రహ్మణ్యం భార్య మధులతను స్థానికులు కాపాడి....మరో బోటులో తరలించగా... సుబ్రహ్మణ్యం, చిన్నారి హాసిని మాత్రం నదీ ప్రవాహంలో గల్లంతయ్యారు. రంపచోడవరం ఆసుపత్రికి మధులతను చికిత్స నిమిత్తం తరలించగా....తన గారాలపట్టి హాసిని, భర్త సుబ్రహ్మణ్యం ఆమె పడుతున్న వేదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
రంపచోడవరం ఆసుపత్రిలో ఏపీ రాష్ట్ర మంత్రి కన్నబాబు... మధులతను పరామర్శించగా.. ఘటన జరిగిన వైనాన్ని ఆమె మంత్రికి వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. పడవ బోల్తా పడిన వెంటనే తన చిన్నారి కూతురు తన కాళ్లను పట్టుకునే వేలాడుతున్నా...కాపాడుకోలేకపోయానని గుండెలు అవిసేలా రోదించారు. పడవ బోల్తా పడిన వెంటనే అప్రమత్తమైన తన భర్త సుబ్రహ్మణ్యం నీటిలో మునిగిపోతున్న చిన్నారి హాసినీని, తనను నీటి పైకి నెట్టి కాపాడినా...సుబ్రహ్మణ్యం మాత్రం కళ్లముందే నీటిలోకి మునిగిపోయారంటూ మధులత పడుతున్న బాధ వర్ణనాతీతం. తన భర్త అంత ప్రయత్నించి.. చిన్నారి హాసినీని పైకి నెట్టినా...తను మాత్రం కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు తిరుపతి అక్కారంపల్లిలోని మధులత నివాసం ఉంటున్న కాలనీలో విషాద వాతావరణం కనిపిస్తోంది. ఆడుతూ పాడుతూ తమ ముందే తిరిగే హాసినీ.....అందరితో కలివిడిగా ఉండే సుబ్రహ్మణ్యం ప్రమాదంలో గల్లంతు అవడాన్ని....బంధువులు స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. తన తండ్రి అస్థికలను కలిపి వస్తామని వెళ్లిన సుబ్రహ్మణ్యం కుటుంబంలో ఇంతటి అలజడి రేగటం బాధాకరమని కన్నీటి పర్యంతమవుతున్నారు.
పడవ ప్రమాదంలో తిరుపతి వాసులు ఉండటంతో... ఒక్క సారిగా నగరంలో విషాద వాతావరణం నెలకొంది. శనివారం పలమనేరు వద్ద కారు ప్రమాదంలో ఐదుగురు నగరవాసులు సజీవదహనమై ఘటన మరువక ముందే...ఇప్పుడు మళ్లీ పడవ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు అవటం నగరవాసులను కలచివేస్తోంది. సుబ్రహ్మణ్యం, హాసినీ క్షేమంగా తిరిగిరావాలని తిరుపతి వాసులంతా ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నారు.
ఇదీ చదవండి: 300 అడుగుల లోతులో బోటు... సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం