వ్యసనం మనిషిని బానిసను చేస్తోంది. మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాల లాగే నీలి చిత్రాలు చూడటం కూడా ఓ రుగ్మతగా మారుతోంది. దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగానూ, సమాజంపైనా తీవ్రంగా ఉంటున్నాయి. చాలామందిలో.. ముఖ్యంగా బాలలు, యువకుల్లో ఇది అలవాటుగా మొదలై క్రమంగా వ్యసనం అవుతోంది. నేర ప్రవృత్తికీ దారితీస్తోంది. వావి వరుసలే కాదు, వయసు, తారతమ్యాలు, లింగభేదం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తల్లి పక్కన ఆదమరచి నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వరంగల్ నిందితుడు ప్రవీణ్ ఉదంతమే ఇందుకు నిదర్శనం.
ఒకప్పుడు వీడియో క్యాసెట్లు, సీడీల రూపంలో వీటి ఉనికి రహస్యంగా ఉండేది. మారిన సాంకేతికతతో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు... వేగవంతమైన అంతర్జాలం వెరసి వేలికొన మీటగానే అశ్లీలత ఉప్పెనలా ముంచెత్తుతోంది. అధిక శాతం లైంగిక నేరాల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీటి ప్రభావం ఉంటోంది. ఎదిగే పిల్లలకు లైంగిక విజ్ఞానం గురించి తల్లిదండ్రులే అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. నీలిచిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్టు నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మొత్తం 800కు పైగా ఆశ్లీల వెబ్‌సైట్‌లను తొలగించాలని కేంద్రం గతంలో సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. అయినా సరే కొన్ని సైట్లు కొత్త రూపాల్లో అందుబాటులోకి వచ్చాయి.
చట్టం ఏం చెబుతోందంటే...
* భారతదేశంలో వ్యక్తిగతంగా ఆశ్లీల చిత్రాలు చూడటం నేరం కాదని.. వాటిని షేర్ చేయటం మాత్రం నేరమని 2015 జులైలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* అయితే పోక్సో చట్టం 2012 ప్రకారం ఛైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, వీడియోలు కలిగి ఉండడం, వాటిని డౌన్‌లోడ్ చేయడం నేరం.
* ఐపీసీ 292, 293, ఐటీ చట్టంలోని సెక్షన్ 67, ఇన్‌డీసెంట్ రిప్రంజంటేషన్ ఆఫ్ ఉమెన్(ప్రొహిబిషన్) చట్టం ప్రకారం నీలి చిత్రాలు తీసినా, వాటిని ప్రచారం చేసినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసేందుకు వీలుంది.
* ఐపీసీ 354 ప్రకారం ఎవరయినా మహిళకు సంబంధించిన వ్యక్తిగత దృశ్యాలు అమెకు తెలియకుండా చూడడం, చిత్రీకరించడం నేరం.
* ఐపీసీ 294 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరమైన చర్యలు చేపట్టడం నేరం.
* ఏ రూపంలో కూడా మహిళలను అమర్యాదకరంగా చూపడం, ప్రదర్శించడం ఇన్‌డీసెంట్ రిప్రంజంటేషన్ ఆఫ్ ఉమెన్(ప్రొహిబిషన్) చట్టం 1986 కింద నేరం.
అంతర్జాలంలో...
* ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ ఇండస్ట్రీ విలువ రూ.6.70 లక్షల కోట్లు
* అమెరికా వాటా 10 శాతం
* గ్లోబల్ పోర్న్ వెబ్‌సైట్స్ 2.80 కోట్లు
* ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు పోర్న్ వీక్షకులు 28,258
* నీలిచిత్రాలను ఫోన్లలో చూసే భారత్ వినియోగదారులు 89 శాతం
* ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌లో రోజూ అశ్లీల వీడియోల కోసం వెతికే వారి సంఖ్య 6.80 కోట్లు
ఏకంగా మూడొంతుల డేటా..
చౌకధరకు స్మార్ట్‌ఫోన్లు, వేగవంతమైన అంతర్జాలం అందుబాటులోకి రావడంతో కుప్పలు తెప్పలుగా ఉన్న పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లను ఎక్కడ నుంచయినా చూసే వెసులుబాటు వచ్చింది. నీలిచిత్రాలను స్మార్ట్‌ఫోన్లలో 89 శాతం మంది చూస్తున్నట్లు ఓ పోర్న్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. ప్రస్తుతం సగటున దేశంలోని ఒక్కో స్మార్ట్‌ఫోన్ నెలకు 9.5 గిగాబైట్ల డేటా వాడుకుంటుండగా అందులో మూడొంతులు ఇలాంటి వాటికే వినియోగిస్తున్నట్లు తేలింది.
ఇవీ విపరీత లక్షణాలు...
* నీలి చిత్రాల్ని అదే పనిగా చూసే వారిలో విపరీతమైన లైంగిక ప్రవర్తనలు ఉంటాయి. చిన్నారుల్ని, మహిళల్ని తమ కోరికలు తీర్చే లైంగిక వస్తువులుగా చూసే ఆలోచనలు పెరుగుతాయి. ఇవే అత్యాచారాలకు దారితీస్తాయి.
* అబద్ధాలు చెప్పడం, మోసం చేసే ధోరణి పెరుగుతుంది.
* కోపానికి, కుంగుబాటుకు గురవుతుంటారు.
* మాదకద్రవ్యాలకూ అలవాటు పడొచ్చు.
* నేరాల బాట పట్టే ప్రమాదం ఉంది.
ఎంత చెప్పినా మారట్లేదని చేయి నరికిన తండ్రి
తెలిసీ తెలియని వయసులో యువత దారితప్పుతోంది. ఫోన్లో నీలిచిత్రాలు చూడటానికి అలవాటుపడి చాలామంది చేయిదాటిపోతున్నారు. ఎంత చెప్పినా మారడంలేదన్న కోపంతో 19 ఏళ్ల కుమారుడి చేతిని తండ్రి నరికేసిన ఉదంతం హైదరాబాద్‌లోని పహడీఫరీఫ్‌లో జరిగింది. పైగా ఇలాంటి అలవాటు ఉన్న వారు సామాజిక మాధ్యమాల్లో బృందాలుగా ఏర్పడి అశ్లీల కంటెంట్‌ను పంచుకోవడమే కాదు, కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా ఇచ్చిపుచ్చుకుంటున్నారు.
మొదట్లో సరదాగా ప్రారంభమై...
నీలిచిత్రాలు చూడటానికి అలవాటుపడ్డవారు మానసిక ఒత్తిడికిలోనై మద్యానికి, ఆ తర్వాత మత్తుమందులకు అలవాటుపడుతుంటారు. ఇది మరిన్ని అనర్థాలకు హేతువు అవుతుంది. మొదట్లో సరదాగా ప్రారంభమై రోజులు గడుస్తున్న కొద్దీ కొత్తదనం కోసం ఉసిగొల్పుతుంది. అంతిమంగా ఇది వారిలో విపరీతమైన ప్రవర్తనకు దారితీస్తుంది. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడటం, పెళ్లయిన వారయితే భాగస్వాములను హింసించడం ద్వారా ఆనందం పొందడం వంటివి చేస్తుంటారు. దీన్ని ఆదిలోనే తుంచేయాలి. ఎదిగే పిల్లలకు లైంగిక విజ్ఞానం గురించి తల్లిదండ్రులే అవగాహన కల్పించాలి.--- - డాక్టర్ విశాల్, జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి, జాతీయ సైకియాట్రిక్ సొసైటీ
ఇదీ చదవండి: Lal Darwaza Bonalu: రేపే లాల్‌దర్వాజా బోనాలు.. ఉత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం