కళ అనేది భాషకు అతీతంగా.. సంస్కృతిని భావితరాలకు తెలియజేస్తూ.. అంతరాలను తొలగించే ఓ చక్కని మాధ్యమం. అలాంటిది చిత్రకళ మాత్రం అంధులకు అందని ద్రాక్షే అనేది ఒకప్పటి భావన. కానీ పట్టుదల ఉంటే వైకల్యం ఏ విజయసోపానాన్ని చేరకుండా ఆపలేదని నిరూపిస్తున్నారు కొందరు అంధులు.
టాక్టైల్ పెయింటింగ్:
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలోని ఈ విభాగం అంధులను సరికొత్త బాటలో నడిపేందుకు కృషి చేస్తోంది. విజన్ రీహాబిలిటేషన్ అంధుల కోసం టాక్టైల్ పెయింటింగ్ శిక్షణను ఇచ్చింది. అలా విజన్ రీ హాబిలిటేషన్ వారి వర్క్ షాప్‌లో శిక్షణ పొందిన వారు గీసిన చిత్రాలను ఎల్వీ ప్రసాద్లో ప్రదర్శనకు ఉంచారు నిర్వాహకులు.
ఔరా అనిపిస్తున్న అంధులు:
టాక్టైల్ పెయింటింగ్‌లో శిక్షణ తీసుకున్న వారిలో సుమారు 20మంది తమ చిత్రాలను ప్రదర్శించారు. ఈ పెయింటింగ్ ప్రత్యేకత ఏమిటంటే స్పర్శ ద్వారా కళ్లు లేని వారు ఈ చిత్రాలను అర్థం చేసుకోగలరు. అంటే రంగులతో పాటు అల్యూమీనియం ఫాయిల్, బీడ్స్, స్టోన్స్ ఇలా వివిధ రకాల మెటీరియల్స్ని వాడి చిత్రాలను అందంగా తయారు చేస్తారు. ఫలితంగా కళ్లులేని వారికి రంగులతో పాటు... వాటిలోని అర్థాలను తెలుసుకోవడం సులభమవటమే కాకుండా వాటిని ఆస్వాదించగలరు. ఇలా చిన్నప్పటి నుంచి రంగులను చూడాలన్న తమ కోరికను, చిత్రకళను నేర్చుకోవాలనుకున్న తపనకు విజన్ రీ హాబిలిటేషన్ వారి చొరవతో సాధించామంటున్నారు ఇక్కడకు వచ్చిన అంధులు.
వారంతా ఆదర్శమే:
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఇన్స్టిట్యూట్ ఫర్ విజన్ రీ హాబిలిటేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కళకు కంటి చూపు అవసరం లేదని నిరూపిస్తున్న ఈ ప్రదర్శన మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: బంగ్లాదేశ్ మార్కెట్.... ఇక్కడ అన్ని చవకే!