ఏడో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay) డిమాండ్ చేశారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరే యువతన్న సంజయ్.. గత ఏడేళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది మంది యువతీ యువకులు కొలువుల కోసం పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు.
ఒక్కసారి కూడా గ్రూప్-1 ఇవ్వలేదంటే..!
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది టీఎస్పీఎస్సీలో (TSPSC) రిజిస్టర్ చేసుకున్నారని.. కమిషన్ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారని బండి సంజయ్ అన్నారు. 2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ వెల్లడించినట్లు తెలిపారు. మన రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదని.. ఉపాధ్యాయ పోస్టులూ భర్తీ చేయలేదని బండి సంజయ్ మండిపడ్డారు.
పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా.. 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందని తప్పుడు మాటలు చెప్పారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. పీఆర్సీ(PRC) ఇస్తామని చెప్పినా ఇప్పటికీ పూర్తికాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. 25 వేల విద్యుత్ ఆర్జిన్ల రెగ్యులరైజేషన్ కాలేదని.. ఏడాదిన్నరగా 12 వేల మంది విద్యా వాలంటీర్లు పస్తులుంటున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: Sonu Sood : మంత్రి కేటీఆర్ అసలైన హీరో: సోనూ సూద్