BJP Strategies for Telangana Assembly Elections 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల సాధనే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రెండు రోజుల పాటు దిల్లీ కేంద్రంగా జరిగిన అంతర్గత సమావేశాల్లో ఆ దిశగా రాష్ట్ర ముఖ్య నేతలకు అగ్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా... రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జీ జావడేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ తరుణ్‌చుగ్‌లతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అధినాయకత్వం పలు అంశాలను రాష్ట్ర నేతలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో పాటు పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల దిశగా సమాయత్తం చేయడంపై దిశానిర్దేశం చేసిందని తెలిసింది.
BJP Telangana Elections 2023 Plan : ప్రధానంగా పార్టీ ముఖ్య నేతలు సొంత ఎజెండాలను వీడి.. పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు, లక్ష్యాలను అనుకున్న విధంగా పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో విభేదాలకు తావుండకూడదని.. ఎలాంటి అంశాలైనా పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప, బహిరంగ ప్రకటనలు చేయడాన్ని సహించబోమని హెచ్చరించినట్టు తెలిసింది. ముఖ్యనేతలు అంతా రాష్ట్రంలోనే ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా అధినాయకులు సూచించారు. పార్టీ సమావేశాలు లేదా ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉంటే తప్ప ముఖ్య నేతలెవరూ దిల్లీలో ఉండకూడదని స్పష్టం చేశారు. అంశం ఏదైనా రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలంతా ఏకతాటిపై ముందుకు వెళ్లాలని చెప్పారు.
Telangana Assembly Elections 2023 : బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు ఏమిటో జాబితా సిద్ధం చేసుకోవాలని.. ఆయా అంశాలపై పోరాడే క్రమంలో జాతీయ నాయకత్వం నుంచి అవసరమైన పూర్తి స్థాయి తోడ్పాటు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యాచరణను అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర నేతలపైనే ఉంటుందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇకపై తెలంగాణలో జాతీయ నాయకులు, కేంద్రమంత్రుల పర్యటనలు విస్తృతంగా ఉంటాయని, ఫలితాల గురించి ఆలోచించకుండా పని చేయాలని సూచించినట్టు తెలిసింది.
వారి సేవలు సమర్థంగా వినియోగించుకోండి..: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలు.. ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఎప్పుడూ లేని విధంగా పార్టీలో బహిరంగంగా విభేదాలు పొడచూపడం, కొంతమంది పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకోవడం వంటివి ఇకపై సహించేది లేదని ఈ సందర్భంగా అధినాయకులు తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సొంత ఎజెండాలకు పార్టీలో తావులేదని.. పార్టీలో చేరికలకు ప్రాధాన్యం ఇస్తూనే పాత నేతలంతా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉండేలా సమన్వయం చేసుకోవాలని షా, నడ్డాలు తెలిపారు. పార్టీ అనుబంధ విభాగాలైన మోర్చాలు ఉత్సాహంగా పని చేసేలా చూడాలని కూడా తెలిపారు. క్రమం తప్పకుండా కార్యక్రమాలు చేపడుతూ పార్టీ శ్రేణులు చురుకుగా ఉండేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వానిదేనని వివరించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అధినాయకత్వం.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రకాశ్ జావడేకర్, తరుణ్‌చుగ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని, వారి సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర నాయకులకు అధినేతలు సూచించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఇవీ చూడండి..:
BJP Operation Akarsh In Telangana : పార్టీ బలోపేతంపైనే కమలనాథుల గురి.. చేరికలకు "ఆపరేషన్ ఆకర్ష్"