భాజపా రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై తుది అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్రానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి అనిల్ జైన్ వచ్చారు. పార్టీ ముఖ్యనేతలు, కోర్‌కమిటీ సభ్యులతో సమావేశమై అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై సోమవారం అభిప్రాయాలను స్వీకరించారు. అనంతరం తిరిగి దిల్లీకి పయనమయ్యారు. పార్టీ నేతల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదిక రూపంలో ఇవ్వనున్నారు.
సీనియర్ల మద్దతు ఆయన వైపే
ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కృష్ణదాస్.. రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరించి జాతీయ నాయకత్వానికి అందించారు. లక్ష్మణ్‌ను కొనసాగించాలని సీనియర్ నేతల్లో మోజార్టీ వర్గం చెప్పినట్లు తెలిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా లక్ష్మణ్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ మాత్రం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు గట్టి మద్దతు పలికినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఉత్కంఠ
అనిల్ జైన్ సమర్పించే నివేదికలో లక్ష్మణ్, సంజయ్‌లలో ఎవరు ముందు వరుసలో ఉన్నారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేతలు కూాడా లక్ష్మణ్‌నే కొనసాగించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల చివరి కల్లా నూతన అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇద్దరిపైనే అధిష్ఠానం దృష్టి
రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్.. చింతా సాంబమూర్తి, సంకినేని వెంకటేశ్వర్లు, డీకే.అరుణ, జితేందర్ రెడ్డితో పాటు మరో ముగ్గురు అధ్యక్ష పదవి రేసులో ఉండగా జాతీయ నాయకత్వం దృష్టిలో లక్ష్మణ్, బండి సంజయ్‌ల పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో ఎవరిని ప్రకటించాలనే దానిపై పార్టీ అనుబంధ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది.
లక్ష్మణుడిపైనే కన్ను
మాజీమంత్రి డీకే.అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ పార్టీలో కొత్తగా చేరిన వారికి అవకాశం లేదనే సంకేతాన్ని జాతీయ నాయకత్వం స్పష్టంగా ఇచ్చింది. ఇక రాష్ట్ర కమల దళపతిగా లక్ష్మణ్‌నే తిరిగి ప్రకటిస్తారని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.