BJP State President Kishan Reddy Fires on BRS : రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. అధికార బీఆర్ఎస్ వాగ్దానాలను.. తొమ్మిదేళ్ల పాలనా లోపాలను ఎండగడుతూ బీజేపీ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌లపై(CM KCR) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణంపై మంత్రి కేటీఆర్‌కు కిషన్ రెడ్డి చురకలాంటించారు.
Kishan Reddy Counter to KTR : టీఎస్‌పీఎస్‌సీ కుంభకోణంపై దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుందన్నారు. ఎన్నికల తర్వాత డిసెంబర్ మూడో తేదీ ముఖ్యమంత్రి అయినట్లు కేటీఆర్ పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. కుంభకోణం జరిగినప్పుడు టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుంభకోణం జరిగినప్పుడు నాకేం సంబంధమని వితండవాదం చేసిన కేటీఆర్ ఇప్పుడెలా ప్రక్షాళన చేస్తారని నిలదీశారు.
Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'
ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రగతి భవన్(Pragathi Bhavan) వదిలి ఫాంహౌస్‌కు పరిమితం కావటం ఖాయమని అన్నారు. కేసీఆర్‌కు యువతపై నిజంగా ప్రేమ ఉంటే ఉద్యోగాలను భర్తీ చేసేవారని.. కేసీఆర్ సర్కార్ కారణంగానే 30లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆక్షేపించారు. నిరుద్యోగుల పాలిట బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఎస్‌పీఎస్‌సీ యమపాశంలా తయారైందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే క్యాలెండర్ ప్రకటించి.. ఆ ప్రకారం భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ ఇప్పుడు అంటున్నారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఎందుకు ప్రక్షాళన చేయలేదు. పేపర్లు లీక్ అయిన వెంటనే.. టీఎస్‌పీఎస్‌స్సీని ఎందుకు రద్దు చేయలేదు. నెలక్రితం వరకు టీఎస్‌పీఎస్సీతో మాకేం సంబంధం లేదన్నారు. మాకేం సంబంధం లేదన్న వ్యక్తి డిసెంబర్ 3 తర్వాత ఎలా ప్రక్షాళన చేస్తారు. తన తండ్రి స్థానంలో తానే ముఖ్యమంత్రి అయ్యినట్లు.. కేటీఆర్ పగటికలలు కనటం మానుకోవాలి. నిరుద్యోగులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉద్యోగాలు భర్తీ చేసేవారు. -కిషన్ రెడ్డి ,రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు
Kishan Reddy on BJP Manifesto 2023 : నవంబర్ 1న జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామన్నారు. జనసేనతో(Janasena Party) పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని.. ఆ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. ఒకేసారి.. సమగ్రమైన మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు చోటు లేదన్నారు.