హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆగస్టు 28న సంజయ్ ప్రారంభించిన పాదయాత్ర (Praja Sangrama Yatra) ఆదివారం నాటికి 185 కిమీ పూర్తి చేసుకుంది. రోజుకు సగటున 12.2 కి.మీ. నడుస్తున్నారు. పాదయాత్ర సమయంలో బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాల్లో వెళ్లే ప్రయాణికుల్ని పలకరించడం.. రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడటం.. గ్రామాలు, పట్టణాలు చేరాక పాఠశాలల భవనాలను పరిశీలించడం చేస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా సంగుపేట నుంచి పాదయాత్ర ప్రారంభించిన సంజయ్ ఆందోలు, జోగిపేట, అన్నసాగర్, చింతకుంట మీదుగా మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ వరకు 11 కిమీ నడిచారు. ఆయన పాదయాత్రలో, సభలలో యువత, రైతులు, మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ‘జీతాలు ఆలస్యంగా వస్తున్నయా? భయపడొద్దు.. మీ హక్కుల కోసం పోరాడాలి. భాజపా అండగా ఉంటుంది’ అని బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ధైర్యం చెబుతున్నారు. ఆందోలులో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్దకు వెళ్లి కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల్ని కలవగా ఏడేళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగం రెగ్యులర్ కాలేదని, 24 మందిలో 18 మంది కాంట్రాక్టు వారిమేనని వాపోయారు. రోడ్డుకోసం స్థలాలు ఇచ్చిన తమకు ఇళ్లిస్తామని చెప్పి ఇవ్వలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నర్సాపూర్ నియోజకవర్గంలో యాత్ర కొనసాగింది. చిలప్‌చెడ్ మండలంలో 14 కిమీ నడిచారు. చిట్కుల్‌లో డబుల్ బెడ్‌రూం ఇల్లు రాలేదని శంకరయ్య, రాఘవులు చెప్పారు. చండూరులో సంజయ్ మట్టికుండలు తయారుచేశారు.
రైతుబంధు రావడం లేదని కౌలు రైతులు..
తమ భూమికి పాస్‌బుక్‌లున్నా ధరణి పోర్టల్‌లో హక్కుదార్ల పేర్లు నమోదు కావడం లేదని.. రుణమాఫీ పూర్తిగా అమలవ్వలేదని.. భూమి లేదంటూ దళితులు.. తమ పిల్లలకు ఉద్యోగం రాలేదని రైతులు.. ఇళ్లు మంజూరు కాలేదని మహిళలు.. ఆర్థికంగా చేయూతనివ్వాలంటూ కమ్మరి, వడ్రంగి వృత్తులవారు.. ఇలా వివిధ అంశాలపై నాలుగొందలకు పైచిలుకు వినతిపత్రాలు వచ్చాయి. పాదయాత్ర పూర్తయ్యాక వీటిని స్థానిక మండల అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు.., ముఖ్యమైన సమస్యల లేఖలను ముఖ్యమంత్రికి పంపించాలని సంజయ్ నిర్ణయించారు.
వ్యూహాత్మకంగా ప్రాధాన్యం
పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక అంశాలకు సంజయ్ వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో హిందూత్వ అంశాన్ని లేవనెత్తారు. గ్రామీణ జిల్లాల్లో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పనితీరును విశ్లేషిస్తూ... ముఖ్యమంత్రి ప్రజల్లోకి రావడం లేదంటూ విమర్శలు సంధిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కాంట్రాక్ట్, ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేషన్ బియ్యం, ఉచిత వ్యాక్సిన్లు, రహదారులు, శ్మశానవాటికల నిర్మాణం, రైతువేదికలు, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న నిధులు, పథకాలతో రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయాన్ని వివరించడం ద్వారా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రసంగాల్లో ప్రధానంగా అధికార తెరాసను లక్ష్యం చేసుకుంటున్నారు. అక్కడక్కడా కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపైనా విమర్శలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలపై పాదయాత్ర ప్రభావం పడకుండా సంజయ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రస్థాయి సమావేశాల్ని పాదయాత్ర జరిగేచోటే ఏర్పాటు చేస్తున్నారు. అమిత్‌షా సభ నేపథ్యంలో శనివారం జోగిపేటలోనే రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించగా ముఖ్యనేతలు అంతా అక్కడికి వచ్చారు. పాదయాత్రపై ప్రతిరోజు రాత్రి లేదా మరుసటిరోజు ఉదయం పాదయాత్ర ఇన్‌ఛార్జి మనోహర్‌రెడ్డి, ఇతర నేతలతో సమీక్షిస్తున్నారు.
ఒక్కో నిరుద్యోగికి... కేసీఆర్ రూ.లక్ష బాకీ
ఇంటికో ఉద్యోగమిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. భాజపా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం మెదక్ జిల్లాలోని చిట్కుల్ నుంచి దుంపలకుంట, రంగంపేట, సంగాయిపేట, చిన్నఘనపూర్ వరకు కొనసాగింది. రంగంపేట సభలో సంజయ్ మాట్లాడుతూ.. ఒక్కో నిరుద్యోగికి తెరాస ప్రభుత్వం రూ.లక్ష బాకీ పడిందన్నారు. కొండగట్టులో 60 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినా, నిరుద్యోగులు, ఇంటర్ విద్యార్థులు, రైతులు, యువకులు, ఆర్టీసీ కార్మికులు.. ఇలా ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం ఎవరినీ పరామర్శించలేదన్నారు. కచ్చితంగా వినాయక్ సాగర్ (హుస్సేన్‌సాగర్)లో నిమజ్జనాలు చేసి తీరుతామన్నారు. కేసీఆర్ తనతో కలిసి ప్రధాని వద్దకు వస్తే తెలంగాణకు 10 లక్షల ఇళ్లయినా మంజూరు చేయిస్తామన్నారు. కేంద్రం నర్సాపూర్ నియోజకవర్గానికి ఎన్ని నిధులిచ్చిందో చదివి వినిపించారు. పార్టీ నేత విజయశాంతి, మాట్లాడారు.
విమోచన దినోత్సవం అధికారికంగా జరిపించాలి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాన్ని ఎగరేసేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు ఆదివారం ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు.
ఇదీ చూడండి: BANDI SANJAY: 'సంక్షేమ పథకాలపై ఈటీవీ భారత్ వేదికగా తెరాసతో చర్చకు సిద్ధం'