BJP state president Bandi sanjay fires on CM KCR: పోలీసులు, తెరాస గుండాలు అడ్డుకున్నా... భాజపా యాత్ర ఆగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ 4వ ప్రజా సంగ్రామ యాత్ర కుత్భుల్లాపూర్‌లోని రాంలీలా మైదానంలో ప్రారంభమైంది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్.. ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. అసోం సీఎంకు భద్రత కల్పించలేని దురవస్థ ఏర్పడిందని మండిపడ్డారు. ధర్మం కోసం, సమాజం కోసం భాజపా పోరాడుతోందని హితవు పలికారు. కేసీఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని పేర్కొన్నారు.
'' వినాయక నిమజ్జనంలో అసోం సీఎం వస్తే తెరాస నేత అడ్డుకున్నారు. ధర్మం కోసం, ప్రజల కోసం కొట్లాడుతున్నాం. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం... ఇక్కడ ఏ పరిశ్రమ వచ్చినా కేసీఆర్ వసూళ్లకు భయపడి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇక్కడ నీరు, గాలి పూర్తిగా కలుషితమైపోయింది. రోడ్లు లేవు... డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేదు. వరదలు, వర్షం వస్తే హైదరాబాద్‌లో ఇల్లు మునిగిపోతున్నాయి. ప్రశ్నిస్తే మతతత్వం అంటున్నారు. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినంను పరేడ్ గ్రౌండ్‌లో కిషన్ రెడ్డి నేతృత్వంలో జరుపుతాం.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
దారుసలాంలో సమావేశం తరవాత సీఎం కేసీఆర్ జాతీయ సమైఖ్యత దినోత్సవం జరుపుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను నిజాం నవాబులు చిత్రహింసలకు గురిచేశారని గుర్తు చేశారు. నాటి నిజాం వారసులే నేటి ఎంఐఎం నేతలని అభివర్ణించారు. ఈడీ కేసుల్లో, లిక్కర్ మాఫియాలో కేసీఆర్ కుటుంబసభ్యులే ఉన్నారని ఆరోపణలు చేశారు. 'ఆర్ఆర్ఆర్'కు మరో ఆర్ జోడిస్తామని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు.
''కేంద్ర కొత్త విద్యుత్ బిల్లులో మోటర్లకు మీటర్లు పెడతామని రాసి ఉంటే నేను రాజీనామా చేస్తా... లేకుంటే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి. పాత పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి అబద్దాలు చెబుతున్నారు. విద్యావ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. హాస్టళ్లలో నీళ్లు లేవు. పురుగుల అన్నం పెడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో రికార్డు కోసం ఒక్క గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తే నలుగురు చనిపోయారు. 30మంది ఆస్పత్రిపాలయ్యారు. దీనికి కారణం వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అల్లుడు. ఆయన్ని బర్త్‌రఫ్ చేయలేదు.'' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
భాజపా పేరు చెప్పి మోటర్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని బండి పేర్కొన్నారు. డిస్కంలను రూ.60వేల కోట్ల నష్టాల్లోకి నెట్టేశారన్నారు. వంద శాతం కరెంట్ బిల్లు పెంచారని ధ్వజమెత్తారు. మళ్లీ రూ.4వేల కోట్ల కోసం మళ్లీ కరెంట్ బిల్లు పెంచే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. భాజపా అధికారంలోకి రాగానే ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హామీనిచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికే ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశమన్నారు. ప్రగతిభవన్ బార్‌గా మారిపోయిందని ఆరోపణ చేశారు. రాత్రి బార్ తెల్లారి దర్బార్ అన్నట్లు మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: