Bandi On CM Kcr: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థులు ఆందోళన చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై భాజపా నాయకులు ఉద్యమిస్తుంటే వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు భాజపా నాయకుల కాళ్లపై నుంచి కార్లు ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఏ ఒక్కరూ కూడా విద్యార్థుల సమస్యలను పట్టించుకున్న వారు లేరు. కనీసం వారు బాధలు వినే నాథుడే లేరు. ఫుడ్ పాయిజన్ అయితే ముఖ్యమంత్రికి సోయి లేదు. డిగ్రీలు రద్దు చేస్తామంటూ విద్యార్థులను బెదిరిస్తున్నారు. వంట చేయడానికి సరైన వసతులు లేవు. వీసీ, ప్రొఫెసర్లు లేరు. కేంద్ర విద్యాసంస్థను కాపాడుకోలేని ముఖ్యమంత్రి అని దేశమంతా కోడై కూస్తోంది.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ సోయం బాపూరావును వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై భాజపా నాయకులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని విమర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రి పాలైన పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలను కేసీఆర్ కాపాడుకోలేకపోతున్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చదవండి: CM KCR in hyderabad: ముగిసిన కేసీఆర్ హస్తిన టూర్.. విపక్ష నేతలతో కీలక చర్చలు!
ఆపరేషన్ ఝార్ఖండ్: 'రూ.10 కోట్లు, మంత్రి పదవి.. అసోం సీఎంతో మీటింగ్!'