Bandi sanjay on Women Commission : మహిళా కమిషన్ తనపై సీరియస్ అయ్యిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. సమాజానికి మంచి జరిగే విషయాలు లీక్ చేస్తే తప్పులేదని... కానీ అందుకు భిన్నంగా లీకుల పేరుతో ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహారించడం సరికాదన్నారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో తనపై జరగుతున్న ప్రచారంపై బండి సంజయ్ ప్రకటన విడుదల చేశారు.
మీడియాకు లీకుల పేరుతో జరుగుతున్న ప్రచారంపై మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. రాజ్యాంగబద్దంగా స్వతంత్య్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై తనకు గౌరవం ఉందని సంజయ్ పేర్కొన్నారు. మహిళా కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సుహ్రుద్భావ వాతావరణంలో లిఖిత పూర్వకంగా జవాబిచ్చినట్లు ఆయన వివరించారు.
Bandi sanjay Attends Before Women Commission: ఎమ్మెల్సీ కవితను కించపరిచానన్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని బండి సంజయ్ వివరించారు. తన స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారని తెలిపారు. తాను మాట్లాడింది తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషే అని పేర్కొన్నారు. అంతే తప్ప మరేలాంటి ఉద్దేశంతో తాను మాట్లాడలేదన్నారు.
'మహిళా కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. నేను మాట్లాడింది తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషే. తెలంగాణలో ఉన్న సామెతను మాత్రమే నేను మాట్లాడాను. కమిషన్ గౌరవప్రదమైన సంస్థ.. దానిని గౌరవించాల్సిన అవసరముంది.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలో ఉన్న సామెతను మాత్రమే వాడాను : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కించపర్చాలనే ఉద్దేశం తనకు లేదని... తెలంగాణలో ఉన్న సామెతను మాత్రమే తాను ఉటంకించినట్లు తెలిపారు. రాష్ట్ర మహిళ కమిషన్ ఎదుట హాజరై... తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు. దాదాపు మూడు గంటలకుపైగా ఈ ప్రక్రియ కొనసాగింది. ఇటీవల ఒక సమావేశంలో ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు.
ఈడీ, సీబీఐ కూడా రాజ్యాంగబద్దమైన సంస్థలే : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల 30లక్షల మంది బతుకులు సర్వనాశనం అయ్యాయని బండి సంజయ్ అన్నారు. అప్పులు చేసి కష్టపడి చదువుకున్న పిల్లల జీవితాలపై ఈ ఘటన తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్దమైన సంస్థ కదా ఎలా కమీషన్‌ను రద్దు చేస్తారని ప్రశ్నించగా.. ఈడీ, సీబీఐ కూడా రాజ్యాంగబద్దమైన సంస్థలే కదా అని ఆయన సమాధానమిచ్చారు. తప్పు చేయనప్పుడు పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ ఎందుకు చేయించలేకపోతున్నారని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు ఎందుకు పనికిరాదన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలో నిందితురాలిగా ఉన్న రేణుక వాళ్ల అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్‌గా ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.
మహిళా కమిషన్ వద్ద ఉద్రిక్తత : బండి సంజయ్ మహిళా కమిషన్ దగ్గరకు వస్తున్నారనే సమాచారంతో... బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుని... అక్కడ నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తల్ని పంపించి వేయాలని బీజేపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో... బీఆర్‌ఎస్ కార్యకర్తల్ని బుద్దభవన్ రోడ్ నుంచి పోలీసులు పంపించి వేశారు. బండి సంజయ్ విచారణ నేపథ్యంలో మహిళా కమిషన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు.
మార్చి 15న కమిషనర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించగా.. తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున ఆరోజు హాజరుకాలేనని బండి సంజయ్ తెలిపారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సూచించినట్లుగా ఈనెల 18న హాజరవుతానని బండి లేఖలో అభ్యర్థించగా.. అందుకు కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆయన కమిషన్ ఎదుట హాజరయ్యారు.
ఇవీ చదవండి: