ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా నేత హుస్సేన్ నాయక్ ఆరోపించారు. దేశ రాజకీయాల్లో, రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఎస్టీలు పూర్తిగా అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో నాయక్ బాధ్యతలు స్వీకరించారు. పాలకులు గిరిజనులను నిర్లక్ష్యం చేస్తున్నారని... వారి అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎస్టీలకు న్యాయబద్ధంగా వచ్చే 10శాతం రిజర్వేషన్ల అమలు కోసం పాటు పడతామని చెప్పారు.
అటవీ ప్రాంతంలో జీవనం సాగిస్తోన్న గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వం... ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఎస్టీలను మోసం చేసిన తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని నాయక్ అన్నారు. పలువురు భాజపా నేతలు నాయక్‌ను అభినందించారు.
ఇదీ చదవండి: బిహార్‌లో మహాకూటమి ఓటమికి కారణాలివే..