BJP Focus Assembly Seats: రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 రిజర్వుడు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన 31 స్థానాలు అత్యంత కీలకమైనవి. ప్రభుత్వ ఏర్పాటుకు 60మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 31 స్థానాలను కైవసం చేసుకుంటే అధికారంలోకి సునాయసంగా రావొచ్చని భాజపా ఆశిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి విస్మరించడంతో ఆ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కమలం పార్టీ భావిస్తోంది.
SC ST seats:ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన భాజపా.. పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం కమిటీలను నియమించింది. ఆ కమిటీలతో సమావేశమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎస్సీ, ఎస్టీలకు తెరాస ఇచ్చిన హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. దళిత ముఖ్యమంత్రి మొదలు దళిత బంధు పథకం వరకు మోసం చేసిన తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్థేశం చేశారు. దళితులకు మూడెకరాల భూమి రెండు పడకగదుల ఇళ్లు, దళితుబంధు పథకాలపై ప్రజలకు వివరించడంతోపాటు దళితుల కోసం కేంద్రం చేస్తున్న సహాయాన్ని వివరించాలని సూచించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మిషన్ 19లక్ష్యంతో పనిచేసి అన్ని స్థానాల్లో విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. అదే స్థాయిలో ఎస్టీల పోడు భూములకు పట్టాలు, 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చని కేసీఆర్ కుట్రలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బండి సంజయ్ సూచించారు. తెరాసకు ప్రత్యామ్నాయం.. భాజపా అనే సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది.