ముంపు ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. గేటుకు తాళం వేసి ఉండటంతో పలువురు కార్యకర్తలు లోపలికి వెళ్ళేందుకు యత్నించగా... వీరిని పోలీసులు అడ్డుకున్నారు.
ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కేటాయించాలని... నిత్యావసర వస్తువులను అందరికీ ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 40 సెంటీమీటర్ల వర్షం పడినప్పుడే ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ఇచ్చాయని గుర్తు చేశారు. ముంపునకు గురైన పరిసరాల్లో మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లాలని డిమాండ్ కోరారు. జోనల్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న భాజపా నాయకులను, కార్యకర్తలను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ధర్నాతో ధరణి పోర్టల్లో తమ వివరాలను పొందుపరిచేందుకు వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గేటుకు తాళం వేయడం వల్ల వెనుతిరిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రూపొందించినప్పటికీ నమోదు చేసుకునేందుకు అధికారులు, నాయకులు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ