BJP plan for bus trip in Hyderabad: సీఎం కేసీఆర్ త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీని పూర్తిగా సన్నద్ధంగా ఉంచేలా పార్టీ శ్రేణులను సంసిద్దం చేస్తోంది. అదే సమయంలో ముందుస్తు ఎన్నికలొస్తే ప్రజా సంగ్రామ యాత్ర పరిస్థితి ఏమిటనే అంశంపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే.. పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం లేనందున. పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర చేపట్టే అంశంపై సీరియస్ గా కసరత్తు మొదలుపెట్టారు.
జంట నగరాల పరిధిలో 10రోజులు యాత్ర.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బస్సు యాత్ర పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగిసిన వెంటనే నాలుగు రోజులు విరామం ఇచ్చి 6వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు బండి సంజయ్ సిద్ధమవుతారని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి హైదరాబాద్ జంటనగరాల పరిధిలో పాదయాత్ర చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జంటనగరాల పరిధిలో 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి రూట్ మ్యాప్ ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్షలు.. మరోవైపు పాదయాత్రతో నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్న బండి సంజయ్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా మూడు రోజుల క్రితం నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. మండలాధ్యక్షులు ఆపై స్థాయి నాయకులు, మోర్చాల అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. ఈనెల 5న ఆదిలాబాద్ జిల్లా నేతలతో.. 6న నిజామాబాద్, 7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత దక్షిణ తెలంగాణ జిల్లాల సమీక్షపై ఫోకస్ పెట్టనున్నారు.
ఇవీ చదవండి: