రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలమీదున్న దృష్టి ప్రజల ప్రాణాలపై లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మన్ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వంద పరీక్షలు చేస్తుంటే.. సుమారు 40 వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ పరిస్థితులపై హైకోర్టు మొట్టికాయలు వేసినా... ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రజల ప్రాణాలు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతోందని ధ్వజమెత్తారు. వివిధ పార్టీలు ఇప్పటికే నగరపాలక ఎన్నికలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయన్నారు. బాధ్యతాయుతంగా ఆలోచించి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని కోరారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పరిస్థితులపై వెంటనే స్పందించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: తెల్లారకుండానే క్యూ కడుతున్న ఆధార్ కార్డులు, వాటర్ బాటిళ్లు..