BJP NATIONAL EXECUTIVE MEETING: హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్ష్యంలో భేటీ నడుస్తోంది. కేంద్రమంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీని సత్కరించారు. అనంతరం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , నేతలు ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి తదితరులు వారిని సన్మానించారు.
ఈ సమావేశాల్లో 2024 ఎన్నికల్లో తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడం.. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలన, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై పార్టీ వైఖరి, గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై కార్యవర్గ సమావేశాల్లో సమాలోచనలు చేయనున్నారని తెలుస్తోంది.
భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్ష ప్రసంగంతో ప్రారంభమయిన సమావేశాలు.. రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీ ప్రసంగంతో ముగుస్తాయి. ఈ సమావేశాల్లో రెండు తీర్మానాలను ఆమోదించనున్నట్లు సమాచారం. ఆర్థిక అంశాలకు సంబంధించి పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు, ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన పరిస్థితి ఉన్నప్పటికీ కరోనాలో కేంద్రం చేసిన పనులు.. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం , వేగంగా అభివృద్ధికి తోడ్పాటు అందించే అంశాలపై కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. దేశంలోని కుటుంబ, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ తీర్మానం తీసుకురానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వంశపారంపర్య పార్టీలు దేశాన్ని ఏ విధంగా అథోగతి పాలు చేస్తున్నాయో తీర్మానం ద్వారా చెప్పాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: Modi Hyderabad Tour: భాగ్యనగరానికి చేరుకున్న ప్రధాని మోదీ..