etela rajender fires on cm kcr భాజపాలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదన్నారు. భాజపాలో చేరే నేతలపై పీడీ యాక్టు పెట్టి జైల్లో వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది చాలా దారుణమన్నారు. వేల సంఖ్యలో ఎంపీటీసీలు, వందల సంఖ్యలో ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
''భాజపాలో చేరే వారిని కేసులతో భయపెడుతున్నారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెరాసలో ఉన్నన్ని రోజులు ఏ కేసులు పెట్టట్లేదు. భాజపాలో చేరేందుకు వేల సంఖ్యలో ఎంపీటీసీలు సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాజపాలో చేరుతారు. పోలీసు అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదు. భవిష్యత్‌లో ప్రభుత్వం మారితే ఇబ్బంది పడేది పోలీసు అధికారులే. అన్నీ గుర్తుంచుకుని రేపు లెక్క అప్పజెప్తాం.'' -ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
ఎన్ని విధాలుగా భయభ్రాంతులకు గురి చేసినా భాజపాలో చేరే నాయకులను ఆపలేరని ధ్వజమెత్తారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు... తెరాసలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కేసులు, వేధింపులు లేవని మండిపడ్డారు. చౌటుప్పల్ ఎంపీపీ భాజపాలో చేరగానే అర్ధరాత్రి ఇంటికి వెళ్లి పోలీసులు వేధిస్తున్నారని విమర్శించారు. కేసులు పెట్టి భయపెడుతున్నారని ఆవేదన చెందారు. ''మీరు చేసిన తప్పులన్నీ లెక్కపెడుతున్నాం.. తప్పకుండా ఆ లెక్కలు తేలుస్తాం.'' అని హెచ్చరించారు. కూలి పని చేసుకుని జీవనం సాగించే భాజపా కార్యకర్తలను కూడా వదలట్లేదని ఆరోపించారు. వివిధ రకాలుగా వారిని వేధింపులకు గురి చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
''ఈనెల 21న భాజపా మునుగోడులో సభ పెడతామని ప్రకటించింది. భాజపా ప్రకటించాక.. కేసీఆర్ చెడుగొట్టే విధంగా 20న సభ పెడతామని ప్రకటించారు. ఏం అవసరమొచ్చిందని కేసీఆర్ సభ పెడుతున్నారు? ఇతర పార్టీల నాయకులకు వెలకట్టడం, ప్రలోభాలకు తెరాస గురి చేస్తోంది. హుజూరాబాద్‌లో చేసిందే మునుగోడులో పునరావృతం చేస్తున్నారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన హుజూరాబాద్ ప్రజలు గట్టి దెబ్బకొట్టారు. కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. మునుగోడు ప్రజలు భాజపాను కోరుకుంటున్నారు. ఎల్లుండి సాయంత్రం జరిగే అమిత్ షా సభకు మునుగోడు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి.'' -ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
తెరాస నాయకులు ఇసుక, భూ, బెల్టు షాపులు నడిపితే ఎవ్వరూ పట్టించుకోరని ఆరోపించారు. భాజపా నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలను వాహనదారుల నుంచి దండుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను తెలంగాణ సమాజం మొత్తం అసహ్యించుకుంటోందన్నారు. కాళేశ్వరం అధ్బుతమని తెరాస నేతలు చెబుతున్నారని పేర్కొన్న ఈటల.. ప్రాజెక్టు అద్భుతమైతే, ఎలాంటి నష్టం జరగకపోతే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సందర్శించడానికి వెళితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుత సృష్టి గోదావరి పరీవాహక ప్రజలను ముంచిందని ఆవేదన చెందారు.
మూడో టీఎంసీ కోసం కూడా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం.. మూడో టీఎంసీ ఎందుకని ప్రశ్నించారు. డబ్భులు దండుకోవడానికే కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని వివరించారు. డిస్కంలు అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. జెన్‌కో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సింగరేణి దివాలా తీసిందని వ్యాఖ్యానించారు. డిస్కంలకు చెల్లించాల్సిన సొమ్ము ప్రభుత్వం చెల్లిస్తే ఈ పరిస్థితి రాదని అభిప్రాయపడ్డారు. గోదావరి వరద ముంపుపై చర్చకు తాము సిద్ధం.. తెరాస సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: