Southern States and Union Territories BJP Meeting In Hyderabad : దక్షిణాది, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు బీజేపీ కార్యచరణను సిద్ధం చేస్తోంది. ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా దక్షిణాది రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల బీజేపీ కీలక సమావేశం నేడు హైదరాబాద్‌లో జరుగుతోంది. రాబోయే శాసనసభ ఎన్నికల దృష్ట్యా సమావేశ వేదికగా హైదరాబాద్‌ను బీజేపీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు హాజరయినట్లు తెలుస్తోంది. బీఎల్ సంతోష్, డీకే అరుణ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి మరో పది మంది నేతలకు అవకాశం కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, సోము వీర్రాజును జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగురోజుల క్రితం తెలంగాణలో బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్‌లో సోము వీర్రాజులను పార్టీ సారథ్య బాధ్యతల నుంచి బీజేపీ అధిష్ఠానం తప్పించింది. వారి స్థానాల్లో కిషన్ రెడ్డి, పురందేశ్వరిలను నియమించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని నియమించారు.
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ వ్యూహాలు : దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. మొన్నటివరకు ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో కూడా.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైయింది. దీంతో దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ వంటి పార్టీలే అధికారంలో ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో అయిన అధికారం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగా ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణను ఎంచుకుంది.
BJP Strategies In Telangana : ఇక్కడ బీజేపీ ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ప్రజాకర్షణ గల నేతలతో బలంగా ఉంది. ఇక్కడ 2018లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాలను సొంతం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 స్థానాలను గెలుచుకుంది. ఈ ఏడాదిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అన్న నినాదాన్ని బీజేపీ తెలంగాణ ప్రజానికం దృష్టికి తీసుకెళుతుంది. అందుకు అనుగుణంగానే జాతీయ స్థాయిలో, ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకులతో ప్రచారం, బహిరంగ సభలు నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి :