నల్గొండ జిల్లాకు చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డవారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని భాజపా మహిళా మోర్చా డిమాండ్ చేసింది. విచారణ నిమిత్తం ఆదర్శ్‌నగర్‌లోని భరోసా కేంద్రానికి వచ్చిన మహిళకు మద్దతుగా భాజపా ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి బృందం వచ్చారు. అత్యాచారానికి గురైన మహిళతో మాట్లాడించకుండా మహిళా మోర్చా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ మహిళను భరోసా కేంద్రంలోకి పోలీసులు పంపించడం వల్ల పోలీసులతో మహిళా మోర్చా నాయకులు వాగ్వివాదానికి దిగడం వల్ల అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
139 మంది అత్యాచారం చేశారని బాధిత మహిళ చెబుతోందని... ఆ విషయాలు తెలుసుకుందామని వస్తే పోలీసులు మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కేసు వెనుక చాలా పెద్ద వాళ్లున్నారని వారు ఆరోపించారు. రాజకీయ నాయకులైనా, సినిమా పరిశ్రమలో ఉన్న ఎంతటి పెద్దవారైనా... ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు నిష్పక్షపాతంగా కేసును విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. రాబోయే బంగారు తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేక్షక పాత్ర వహింస్తున్నారని వారు మండిపడ్డారు.
ఇవీ చూడండి: యువతిపై 139 మంది బలాత్కారం.. పంజాగుట్టలో ఫిర్యాదు!