BJP leaders Meeting about assembly session : శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తాలని భాజపా నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7నుంచి ప్రారంభం కానుండడంతో భాజపా శాసనసభాపక్షం సమావేశమైంది. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావుతోపాటు సీనియర్ నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భాజపా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు బండి సంజయ్ సూచించారు. 317 జీవో, వరిధాన్యం కొనుగోలు అంశంపై సభలో చర్చకు లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారు.
మార్చి 7 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు
మార్చి 7 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు కోసం ఇటీవలె అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ, మండలిని సమావేశ పర్చాల్సిన తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను మార్చి నెలాఖరులోగా ఆమోదించాల్సి ఉంది. ఆలోగా ఉభయ సభలు పద్దుకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. మార్చి 7 నుంచి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 6న ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశంలో పద్దుకు అమాత్యులు ఆమోదం తెలుపనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సమాచారం ఇచ్చారు.
ఇదీ చదవండి: తెలంగాణలో మరో భారీ సంస్థ పెట్టుబడులు..