తెలంగాణలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ భాజపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ నేడు మహిళా సంకల్ప దీక్షలో కూర్చోనున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్ష చేపట్టనున్నారు. నేటి నుంచి రెండురోజుల పాటు జరిగే మహిళా సంకల్ప దీక్షను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారటం వల్లనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని డీకే.అరుణ ఆరోపించారు.
మద్యపానాన్ని నిషేధించే వరకు..
మద్యం సేవించిన తరవాతనే నిందితులు దిశపై అత్యాచారానికి ఒడిగట్టారని ఆమె గుర్తు చేశారు. దేవాలయాలు, బడులు, జాతీయ రహదారులు అనే తేడా లేకుండా ప్రభుత్వం మద్యం దుకాణాలకు ద్వారాలు తెరించిందని ఆమె ధ్వజమెత్తారు. మద్యపానాన్ని నిషేధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో ప్రజా సంఘాలు, మహిళలు, మేధావులు కలసిరావాలని కోరారు.
ఇవీ చూడండి: 'మద్యం వల్లే మహిళలపై అఘాయిత్యాలు'