రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సవాల్ విసిరారు. కేంద్ర నిధులపై శాఖల వారిగా కేటీఆర్‌తో చర్చకు సిద్ధమని లక్ష్మణ్ ప్రకటించారు. దక్షిణాదిని కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందన్ని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి వేర్పాటు వాదాన్ని కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రక్షణశాఖ భూములను కొట్టేయాలన్న తెరాస ప్లాన్ ఫెయిల్ అయిందని....అందుకు కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. రక్షణ రంగంలో కేంద్రం హైదరాబాద్‌కే పెద్ద పీట వేసిందని ఆయన స్పష్టం చేశారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ముందుకే వస్తే... రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. 14వ ఆర్థికసంఘం మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తున్నా... రాష్ట్రం వినియోగించడం లేదని ఆరోపించారు. చింతమడకలో అభివృద్ధికి రాష్ట్రం కంటే ఎక్కువగా కేంద్రం నిధులు కేటాయించిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న నిధులను ఇతర ప్రాజెక్టులకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి:దిశ సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు