BJP Focus on Operation Akarsh: రాష్ట్రంలో బలమైన రాజకీయ పక్షంగా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తోంది. ఇందులో భాగంగా సందర్భంగా వచ్చినప్పుడుల్లా పార్టీ అగ్రనేతల పర్యటనలతో క్యాడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల్లో తమ బలాన్ని చాటుతూ, తెరాసకు ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే పార్టీ బలానికి తోడు దుబ్బాకలో రఘునందన్‌రావు, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థుల వల్లే విజయం దక్కిందనే అభిప్రాయం ఉంది. ఇటీవల మునుగోడు ఉపపోరులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి వారి వల్లే కమలదళం భారీగా ఓట్లు సాధించించేందనే విశ్లేషణలూ ఉన్నాయి. ఈ అంచనాలతోనే అన్ని నియోజకవర్గాలోనూ బలమైన అభ్యర్థుల కోసం కమలదళం అన్వేషణ సాగిస్తోంది.
ఇందులో భాగంగా అధికార తెరాసతో పాటు కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల కోసం కాషాయదళం ఆన్వేషిస్తోంది. కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలతో పాటు రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గంపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వారిని కాషాయగూటికి చేర్చే పనిలో పడింది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 25న దిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. మర్రి శశిధర్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ కూడా చేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఒక వేళ దిల్లీలో చేరని పక్షంలో ఈ నెల 28న బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర సందర్భంగా బైంసాలో నిర్వహించే బహిరంగ సభలో చేరుతారని చెబుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి చేరిక సందర్భంగా సంజయ్, డీకే.అరుణ దిల్లీ బయల్దేరి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మర్రి శశిధర్ రెడ్డిని భాజపాలోకి తీసుకురావడంలో డీకే.అరుణ కీలకంగా వ్యవహరించారు.
గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన డీకేకు అక్కడి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో భాజపాలోకి చేర్చుకోవడం సులువుగా మారింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంతో పాటు కాంగ్రెస్‌లో బలమైన నేతలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలని కమలదళం నిర్ణయించుకుంది. మర్రి శశిధర్ రెడ్డి రాక అనంతరం కాంగ్రెస్‌కు చెందిన మరో కీలక నేత కూడా భాజపాలోకి వస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే సదరు మాజీ ఎమ్మెల్యేతో సంప్రదింపులు పూర్తైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పూర్తిగా బలహీన పడితే తమకు ఎదురుండదని భాజపా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ భాజపాకు కలిసివస్తుందని లెక్కలు వేసుకుంటోంది. దీని ద్వారా అధికార తెరాసపై పైచేయి సాధించవచ్చని అంచనా వేసుకుంటోంది.
ఇవీ చదవండి: