BJP focus on Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న కమలంలో కల్లోలం మొదలైంది. నివురు గప్పిన నిప్పులా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్.. రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే జాతీయ నాయకత్వం ఇద్దరు నాయకులను దిల్లీ పిలిపించుకొని విభేదాలు పక్కనపెట్టి బీజేపీ విజయానికి పని చేయాలని దిశానిర్దేశం చేసింది. అయినప్పటికీ "ఇంటింటికి బీజేపీ" ప్రచార కార్యక్రమానికి ఈటల దూరంగా ఉన్నారు. పార్టీ కీలక నేతలైన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. దాంతో తాజాగా మరోసారి బీజేపీ అధిష్ఠానం అసంతృప్త నేతలను బుజ్జగించేే ప్రయత్నం ముమ్మరం చేసింది.
BJP High Command Calls Komatireddy Rajagopal Reddy : రాష్ట్రంలో బీజేపీలో అంతర్గత విభేదాలు చెలరేగుతున్న వేళ తెలంగాణపై ఆ పార్టీ అగ్రనేతలు దృష్టిసారించారు. ఈ క్రమంలోనే పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దిల్లీ రావాలని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్దరు ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాగా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల దిల్లీలో పార్టీ అగ్రనేతలతో వరుసగా సమావేశమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై వారితో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల, రాజగోపాల్ రెడ్డిని దిల్లీకి పిలవడం చర్చనీయాశమైంది.
పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీలకు వెళ్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిని దిల్లీకి రావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకొంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను పిలుపించుకొని మాట్లాడాలని అధిష్ఠానం నిర్ణయించింది. మొత్తం మీద తెలంగాణ బీజేపీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
చేరికలపై ఆషాఢం ఎఫెక్ట్..: మరోవైపు.. పార్టీ ముఖ్య నేతలతో బండి సంజయ్ విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ తాజా పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్లు.. మద్యం కేసులో కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నట్లు సమాచారం. లేకుంటే బీజేపీకి నష్టం తప్పదని సీనియర్లు బండి సంజయ్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే పార్టీని వీడాలనుకునే వారిని ఆపవద్దని బండితో సీనియర్లు చెప్పినట్లు సమాచారం. బీసీ గర్జనకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్టీ నేతలతో భేటీలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఇంటింటికీ బీజేపీకి మంచి స్పందన వస్తోంది. చేరికలపై ఆషాడం ప్రభావం ఉంటుంది. పొంగులేటి కూడా ఆషాడంలో కాంగ్రెస్‌లో చేరకపోవచ్చు. చేరికల గురించి ఆలోచించడం లేదు. రాజగోపాల్ రెడ్డి ఉదయం కాల్ చేశారు. ఎల్లుండి నడ్డా రాష్ట్ర పర్యటనలో ఇద్దరు ప్రముఖులను కలుస్తారు.'-బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :