Sanjay and Revanth Reddy Responded on Kamareddy Issue: కామారెడ్డి మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తక్షణమే రద్దు చేసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. నెల రోజులుగా కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు. అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. మాస్టార్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామిక వాడల కింద గుర్తించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ఈ విషయంలో మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గ్రామ సభలు పెట్టి రైతులతో చర్చించకుండా, రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా ఎలా అమలు చేస్తారని నిలదీశారు. రైతుల ఉద్యమం నెల రోజులుగా నడుస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం, రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందనడానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రాణ సమానమైన భూములను కాపాడుకునేందుకు కలెక్టర్‌తో చర్చించేందుకు వస్తే, కనీసం రైతులతో మాట్లాడేందుకు కూడా నిరాకరించడం ప్రజల పట్ల పాలకులకు ఉన్న నియంత ధోరణికి పరాకాష్టగా ఆయన అభివర్ణించారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతుల ఆందోళనలను విరమింపజేసేట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రాములు కుటుంబానికి కోటి రూపాయల పరిహారం అందించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆన్ని రకాల ఆదుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ వైఖరికి ఒక రైతు బలికావడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
రైతు మృతదేహం తరలింపు విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అయన విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా కలెక్టర్, పోలీసులు భావించవద్దన్నారు. చట్టబద్దంగా వ్యవహారించకపోతే భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఉగ్రవాదులుగా సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ అలైన్‌మెంట్ మార్చకుండా ఇలాగే ముందుకు వెళ్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని గుర్తించాలన్నారు. రైతులు చేపట్టబోయే ఆందోళనకు బీజేపీ మద్దతు కొనసాగుతుందన్నారు.
ఇవీ చదవండి: