BJP approached TS High Court about buying TRS MLAs తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార తెరాస, భాజపా నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ భాజపా హైకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరసారాలు జరిగాయన్న అభియోగంపై మొయినాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని హైకోర్టును భాజపా కోరింది.
భాజపా తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాజపా ప్రతిష్ఠను దెబ్బతీసే దురుద్దేశంతో కేసు పెట్టారని పిటిషన్‌లో భాజపా ఆరోపించింది. మునుగోడులో భాజపా ప్రచారాన్ని అడ్డుకునేందుకు తెరాస అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి తమకు మంచి స్పందన వస్తోందని తెలిపింది.
రాష్ట్రంలో తమ పార్టీ గట్టి పట్టు సాధించిందని.. తెరాసకు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని పిటిషన్‌లో భాజపా వివరించింది. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నందున భాజపాకు ప్రజల నుంచి విస్తృతమైన ఆదరణ, మద్దతు వస్తోందన్నారు. ఇదిలా ఉండగా నిన్న మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌లో నలుగురు తెరాస ఎమ్మెల్యేలకు భాజపా సభ్యులు ప్రలోభాలు ఎరవేశారంటూ తెరాసకు అనుకూలమైన కొన్ని ఛానెళ్లు పదేపదే ప్రసారం చేశారని పిటిషన్‌లో భాజపా ఆరోపించింది. పోలీసులు చేరక ముందే కొన్ని ఛానెళ్లు వెళ్లి ప్రత్యక్ష ప్రసారం చేశాయని తెలిపింది.
సైబరాబాద్ సీపీ, ఇతర పోలీసు అధికారులు వెళ్లిన తర్వాత ఫాంహౌజ్‌లో ముగ్గురిని అదపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తర్వాత ఒక్కొక్కరి వంద కోట్ల రూపాయల ఆశచూపి భాజపాలో చేరారని ప్రలోభ పెట్టారని సైబరాబాద్ సీపీ మీడియాకు తెలిపారన్నారు. భాజపాలో చేరితే 100కోట్ల రూపాయలు ఇస్తామని లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెడతామని బెదిరించారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిన్న ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
మునుగోడు ఉపఎన్నికల్లో భాజపా ప్రతిష్ఠ దెబ్బతీసి, నైతిక స్థైర్యం దెబ్బతీసే రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారని పిటిషన్‌లో భాజపా ఆరోపించింది. సీఎం, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, మంత్రులు, పార్టీ సీనియర్ నేతల ప్రోద్బలంతోనే ఈ ఫిర్యాదు చేసినట్లు పిటిషన్‌లో ఆరోపించారు. సీబీఐ లేదా సిట్ దర్యాప్తు ద్వారానే ఫిర్యాదు వెనుక వాస్తవాలు, ఉద్దేశాలు బయటకు వస్తాయని భాజపా పేర్కొంది. లేకపోతే మునుగోడు ఎన్నికల్లో భాజపాకు తీవ్రనష్టం జరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
కేసుల దర్యాప్తు స్వేచ్ఛగా, సరైన విధంగా ఉండాలని కోర్టులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయని పిటిషన్‌లో భాజపా గుర్తు చేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని.. అధికార పార్టీ నేతల సూచనల మేరకు నడుచుకుంటున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. కాబట్టి దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థ లేదా ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిషన్‌కు బదిలీ చేయాలని భాజపా కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని భాజపా కోరింది. పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:
Trying to Buy TRS MLAs: నిందితులపై కేసు.. FIR కాపీలో కీలక విషయాలు
Bandi on Buy TRS MLAs Issue: 'కేసీఆర్ దమ్ముంటే యాదాద్రికి రా.. ప్రమాణం చేద్దాం'