Bhatti Vikramarka Planning Review : జంటనగరాల్లో చెరువులు, కుంటల పరిస్థితిపై ఐదు రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రణాళిక శాఖ అధికారులను ఆదేశించారు. 2014 ముందు ఉన్న చెరువులు, నీటి కుంటలు ఎన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఎన్ని చెరువులు అన్యా క్రాంతమయ్యాయి? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఏమిటన్న విషయమై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రణాళిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం, ప్రభుత్వ ఆలోచన సరళికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుత సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రణాళికలు రావాలని సూచించారు.
Bhatti Vikramarka on Planning Department in Telangana : రాష్ట్ర అభివృద్ధిలో ప్రణాళిక శాఖ పాత్ర కీలకమని, ప్రణాళిక శాఖ రూపొందించే ప్రణాళికలు అభివృద్ధికి దిక్సూచి అవుతాయని పేర్కొన్నారు. గణాంకాలను ఢాంభీకాలకు పోకుండా వాస్తవాలకు దగ్గరగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు ద్వారా సమాజంలో వస్తున్న మార్పులను శాస్త్రీయంగా అంచనా వేయాలని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, అమలు చేసే సంక్షేమ పథకాల సరళిని లెక్కలు కట్టే ప్రణాళిక శాఖ నివేదికల తయారీలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. సర్కార్ అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజల జీవన స్థితిగతుల్లో వస్తున్న మార్పులు, జీవన ప్రమాణాల పెరుగుదలకు సూచికలు నమోదు చేయడంలో ప్రణాళిక శాఖ కీలకపాత్ర వహిస్తుందని వెల్లడించారు. అధికారులు అంకితభావంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని భట్టి విక్రమార్క వివరించారు.
ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదన్న పెద్దలకు ప్రజలు ఓటుతో చెంపచెల్లుమనిపించారు : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka on Finance Department : మరోవైపు ఇటీవల అర్థిక శాఖపై సమీక్ష నిర్వuించిన భట్టి విక్రమార్క రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని తెలిపారు. అయినప్పటికీ ఆర్థిక శాఖ బాధ్యతలను సవాల్‌గా తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని కోరారు.
సంపద సృష్టించడం, సృష్టించిన సంపద ప్రజలకు పంచడం కోసం అధికారులు కృషి చేయాలని, ఆదాయ వనరుల అన్వేషణ కోసం మేదస్సును ఉపయోగించాలని భట్టి విక్రమార్క కోరారు. ప్రభుత్వ విజయం ఆర్థికశాఖపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఉద్యోగస్తుల్లా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని సూచించారు.
అలా చేస్తే ప్రభుత్వ విజయానికి దోహదపడిన వారు అవుతారని మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలిసికట్టుగా సాధిద్ధామని ఉపముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం - త్వరలోనే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం : ఉపముఖ్యమంత్రి భట్టి