Bhatti People March Completes 100 Days : ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని...వారిలో భరోసా నింపడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే లక్ష్యంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకుంది. మార్చి 16న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీకారం చుట్టిన యాత్ర కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల గుండా కొనసాగుతోంది. వాహనం ఎక్కకుండా 1100 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర పూర్తిచేసిన భట్టి దారి పొడవునా వివిధ వర్గాలను కలిసి కాంగ్రెస్ అండగా ఉంటుందనే సందేశాన్ని బలంగా తీసుకెళుతూ ముందుకుసాగుతున్నారు.
Bhatti Padayatra Completes 1100 KM : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర వందరోజులు పూర్తి చేసుకుంది. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజల కష్టాలు, సర్కార్ వైఫల్యాలను ఎక్కుపెట్టే ఉద్దేశంతో భట్టి విక్రమార్క ఈ ఏడాది మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో పాదయాత్ర ప్రారంభించారు. పీపుల్స్ మార్చ్ పేరిట మొదలైన యాత్ర ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా సాగింది. మంచిర్యాల భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరయ్యారు. భట్టి పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో మండుటెండలను సైతం లెక్కచేయక రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. నైరాశ్యంలో ఉన్న క్షేత్ర స్థాయి కాంగ్రెస్ శ్రేణుల్లో భట్టి పాదయాత్ర కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. భట్టి తన పాదయాత్రలో జనాలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో సమగ్రంగా వివరిస్తున్నారు.
Bhatti Padayatra Completes 100 Days : మార్చి 16న మొదలైన పాదయాత్ర మండుటెండల్లో అలుపెరగని బాటసారిలా నిరాటంకంగా కొనసాగింది. ఎక్కడా వాహనం ఎక్కకుండా నడుచుకుంటూనే ముందుకు సాగుతున్నారు. ఎక్కడ చీకటైతే అక్కడే షామియానా కింద విశ్రాంతి తీసుకుంటూ సాదాసీదాగా పాదయాత్ర సాగిస్తున్నారు. మండుటెండల్లో నడక కొనసాగడంతో రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు. జడ్చర్ల సమీపంలోని ఉదండాపూర్‌లో వడదెబ్బ తగిలి నీరసించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాక స్వస్థత చేకూరాక తిరిగి మొదలుపెట్టారు. జడ్చర్ల బహిరంగ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సిఖ్విందర్ సింగ్ సుక్కు హాజరై భట్టి పాదయాత్రను అభినందించారు. జడ్చర్ల సభ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లాలో పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. నకిరేకల్ నియోజకవర్గం కేతెపల్లి వద్ద వడదెబ్బకు గురైన భట్టి రెండు రోజులు విశ్రాంతి అనంతరం ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి నడక ప్రారంభించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో వంద రోజులు పూర్తయింది. ఇప్పటి వరకు దాదాపు 1100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యాత్ర నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. సూర్యాపేట మీదుగా ఖమ్మం నగరానికి చేరుకోనుంది. అక్కడ భారీ బహిరంగసభతో పాదయాత్ర ముగియనుంది.
ఇవీ చదవండి: