సునీల్ నాయక్ మృతి అత్యంత బాధాకరమని.. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణమే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల కోసం క్యాలెండర్ ప్రకటించి.. అందుకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ యువత ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని భట్టి సూచించారు. సమస్యలను పోరాడి పరిష్కరించుకుందామని తెలిపారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆత్మబలిదానాలు అత్యంత విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు కార్యరూపం దాల్చేట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచాలని.. అప్పుడే చాలామంది నిరుద్యోగులు అర్హత సాధించేందుకు వీలుంటుందని భట్టి విక్రమార్క వెల్లడించారు.