Bharat Biotech vaccine for dogs : బయోవెట్ ద్వారా రేబిస్ వ్యాధిని నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 24న ప్రారంభమైన బయో ఆసియా 2023 చర్చాగోష్ఠిలో ఆయన కుక్క టీకాలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.
Bharat Bio tech in Bio Asia Summit 2023 : ప్రతి సంవత్సరం ఇండియాలో కుక్కకాటుతో 25000 మందికి పైగా చనిపోతున్నారన్నారు. వీలైనంత త్వరితగతిన ఈ టీకాను ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న బయోవెట్.. ఇప్పటికే కుక్కలకు టీకా ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలతో పాటు ఎటువంటి కుక్కకైనా ఈ టీకాను వినియోగించే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో టీకాను ఆవిష్కరించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించారు.
దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో భారత్ బయోటెక్ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి విరుగుడుగా కొవాగ్జిన్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసింది. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వచ్చింది. ఆ తర్వాత చిన్న పిల్లల కోసం నాజిల్ వ్యాక్సిన్ను కూడా తయారు చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కుక్కలకు టీకా రూపొందిస్తోంది.
రాష్ట్రంలో వీధికుక్కల స్వైరవిహారం రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. మొన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 16 మందిపై వీధికుక్కలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటన మరవకముందే నిన్న తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏడుగురిపై కుక్కలు తమ ప్రతాపాన్ని చూపాయి. ఇటీవల అంబర్పేటలో నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో చనిపోవడంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ఈ నిర్ణయం తీసుకున్న రెండ్రోజుల్లోనే దాడులు మరింత ఎక్కువ కావడం గమనార్హం.
ఇవీ చదవండి: