Krishna Ella at CII Telangana Annual meeting: తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిందని.. ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనే శక్తి రాష్ట్రానికి ఉందని.. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్. కృష్ణ ఎల్ల అన్నారు. తెలంగాణ నుంచి అనేక దేశాలకు ఔషధాలు ఎగుమతి చేస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బేగంపేట ఐటీసీ కాకతీయలో జరిగిన సీఐఐ తెలంగాణ వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో కలిసి కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. సమావేశానికి ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, సీఐఐ ప్రతినిధులు హాజరయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి రాష్ట్రంలో అన్ని రకాల వసతులు ఉన్నాయన్న సీఎండీ.. ఇతరుల కంటే ముందుగానే వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరింత సామర్థ్యంతో పనిచేసేందుకు భారత్ బయోటెక్ నిపుణులు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
విలువ జోడించాలి
ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే శక్తి భారత్‌కు ఉందని.. అందుకోసం వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో భారత రైతులు మరింత పురోగతి సాధించాలని కోరారు. రైతులు పండించే పంటలకు విలువ జోడించాలని సూచించారు.
"ప్రజలకు కావాల్సిన దాన్ని గ్రహించి వెంటనే మార్కెట్‌లోకి తేవాలి. ప్రపంచం మొత్తానికి ఆహారం అందించే శక్తి భారత్‌కు ఉంది. మన వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి. వ్యవసాయ, ఆహారశుద్ధి పరిశ్రమలపై సీఐఐ దృష్టి సారించాలని కోరుతున్నాను. కరోనా సమయంలోనూ వ్యవసాయ రంగం మంచి వృద్ధి సాధించింది. దేశ ప్రగతికి కృషి చేస్తున్న రైతుల పట్ల మనమంతా కృతజ్ఞత చూపించాలి." -కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ సీఎండీ
ప్రభుత్వ మద్దతు అభినందనీయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సహకరిస్తున్నాయని కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని ఎప్పుడూ అడ్డుకోదని వెల్లడించారు. ప్రభుత్వాలు సహకరించకపోయినా సరే కానీ కొత్తగా సమస్యలు సృష్టించకూడదని పారిశ్రామికవేత్తలు భావిస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పారిశ్రామికవేత్తను ఇబ్బంది పెట్టలేదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో టీఎస్‌ఐఐసీతో ఇబ్బంది వచ్చినప్పుడు.. సంస్థకు ప్రభుత్వపరంగా అవసరమైన సాయం అందించారని కృష్ణ ఎల్ల వెల్లడించారు.
ఇదీ చదవండి: ఆర్థిక ఆంక్షలతో 'పుతిన్' ఉక్కిరిబిక్కిరి- చైనా తోడున్నా..!