కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బంద్‌కు(Bharat Bandh in Telangana) హైదరాబాద్‌లో అఖిలపక్షాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, తెదేపాతో సహా రైతు సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. నగరంలోని కూకట్ పల్లి, జీడిమెట్ల బస్ డిపోల బస్సులు(bus depot) బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని చిలకలగూడ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రధాన రహదారిపై తిరుగుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి వేయించారు. అఖిలపక్ష రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిక్కడపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఉప్పల్‌లో రేవంత్ రెడ్డి
ఉప్పల్ బస్ డిపో వద్ద పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(revanth reddy), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొని ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేడ్చల్ బస్ డిపో ఎదుట అఖిలపక్షాల ఆధ్వర్యంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాస్తారోకో నిర్వహించారు. గుజరాత్ నుంచి బయలు దేరిన నలుగురు వ్యక్తులు దేశాన్ని ఆగమాగం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ, అమిత్ షాలు అమ్మడానికి వస్తే అదాని, అంబానీలు కొనడానికి ముందుకు వస్తున్నారని ఆయన విమర్శించారు.
గుర్రపు బండిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
చమురు ధరల పెంపుపై కేంద్రం వైఖరిపై నిరసన వ్యక్తం చేసేందుకే తామంతా గుర్రపు బండ్లపై అసెంబ్లీకి వెళ్లినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు రవాణా వ్యవస్థను భరించలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలియజేయడం కోసం గుర్రపు బండ్లపై వెళ్లినట్లు చెప్పారు. కానీ తమను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు.
![Bharat Bandh in Telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13190763_5.png)
హైదరాబాద్ కొత్తపేట కూడలిలో అఖిలపక్ష నేతులు ధర్నా నిర్వహించి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. హయత్ నగర్ వద్ద నిరసన తెలపడానికి వచ్చిన పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి వనస్థలిపురం స్టేషన్‌కు తరలించారు. హయత్ నగర్ బస్ డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో సహా వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో పలు చోట్ల విధులకు హాజరై ఉద్యోగులు, ప్రయాణికులు భారత్ బంద్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు.
![Bharat bandh protest all over telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13190763_1.png)
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్, వామపక్ష నేతలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బస్ డిపో వద్ద బస్సులను అడ్డుకునేందుకు యత్నించిన వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ఆర్టీసి డిపోల ఎదుట బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మెదక్, జహీరాబాద్ డిపోల ఎదుట అఖిలపక్ష నాయకులు ధర్నా చేప్టటారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో పాటు వామపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![Bharat bandh protest all over telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13190763_2.png)
సింగరేణిలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని బొగ్గు గనుల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. హన్మకొండలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి వేయి స్తంభాల ఆలయం నుంచి కాజీపేట వరకు తెరిచి ఉన్న దుకాణాలను మూసి వేయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా వామపక్షాలు, కాంగ్రెస్ , తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఖమ్మం నూతన బస్టాండ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారత్ బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్ష నాయకులు, కార్యకర్తలు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, మిర్యాలగూడ, భువనగిరిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అఖిలపక్షాలు బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బైఠాయించారు.
![Bharat bandh protest all over telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13190763_4.jpg)
ఇదీ చూడండి: Congress leaders on arrests: ప్రభుత్వానికి చెప్పడం కోసమే గుర్రపు బండ్లపై వెళ్లాం: భట్టి