సీఐడీ డీఐజీ సుమతికి ఉత్తమ కొవిడ్ వారియర్ ఉమెన్ పోలీస్ ఆఫ్ తెలంగాణ అవార్డు దక్కింది. 29వ జాతీయ మహిళా కమిషన్ ఉత్సవాల్లో భాగంగా ఆమె దిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
కొవిడ్ సమయంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. కరోనా సమయంలో తెలంగాణకు నిత్యావసరలు వస్తువులు, ఇండస్ట్రీలకు కావాల్సిన అత్యవసర సామగ్రి తరలింపునకు ఎటువంటి ఆటంకం రాకుండా చూశారు. సుమారు 90 ఎన్జీవోలతో సమన్వయం చేసుకుని రూ. 90 కోట్లు విలువ చేసే ఆహారం, దుస్తులు, నిత్యావసరాలను అందించారు.
వలస కూలీలను స్వస్థలాలకు పంపేందుకు కూడా ఎంతో కృషి చేశారు. ఒక యాప్‌ను ఏర్పాటు చేసి డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూశారు. గృహ హింస కేసులపై డయల్ 100 ద్వారా వచ్చిన ఫోన్లకు వెంటనే స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. కొవిడ్ సమయంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఆమెకు పురస్కారం వరించింది. డీజీపీ మహేందర్‌రెడ్డి, మహిళా విభాగ అదనపు డీజీతో పాటు పలువురు పోలీసు అధికారులు డీఐజీని అభినందించారు.
ఇదీ చూడండి: ట్రామాకేర్ సెంటర్‌గా శామీర్‌పేట్ ఆస్పత్రి : ఈటల