Minister Komatireddy Comments On Telugu Film Industry : తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలు నిర్మించామని, టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంటే ఐదారుగురు పెద్దలు, ఐదారుగురు హీరోలదే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదని వ్యాఖ్యానించారు.
‘చిత్రపురి’లో తెలంగాణ వారికే ప్రాధాన్యత : హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి, రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బాగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కి అభినందనలు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ఆయన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు హీరోలు ఎదుగుతున్నారని, నిజమైన తెలంగాణ ప్రతిభ కలిగిన నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో చాలా మంది బయటి వ్యక్తులున్నారని, కొత్తగా నిర్మించే ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు ఆపామని, వాటన్నింటిని తెలంగాణ నటీనటులకే ఇచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నుంచి మా భూమి, బలగం వరకు ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయని, ఎంతో మంది ప్రతిభ కలిగిన దర్శక నిర్మాతలున్నారని తెలిపిన మంత్రి, తప్పకుండా తమ ప్రభుత్వం తరపున అన్నివిధాల సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.
"తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ బాగా వృద్ధి చెందాలన్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు సినిమా థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న మూవీస్ వారికీ నా వంతు సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు రాష్ట్ర సర్కార్ తరఫున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ప్లాట్లలో తెలంగాణ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తాం." -కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర మంత్రి