Bathukamma sarees Distribution 2022 : తెలంగాణ బతుకు పండుగ బతుకమ్మను పురస్కరించుకుని ఆడపడుచులకు ప్రభుత్వం నేటి నుంచి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే కోటి చీరలను సిద్ధం చేసి జిల్లాలకు తరలించిన సర్కారు.. 10 రకాల రంగుల్లో 24 విభిన్న డిజైన్లతో, 240 రకాల త్రేడ్ బోర్డర్‌లతో చీరలను తయారు చేయించినట్టు పేర్కొంది.
సర్కారు తయారు చేయించిన కోటి చీరల్లో 92 లక్షలు సాధారణ చీరలు కాగా... అదనంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో వృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల చీరలు 8లక్షలు సిద్ధం చేసినట్టు స్ఫష్టం చేసింది. ఇందుకోసం మొత్తం 339.73 కోట్లు ఖర్చు చేసినట్టు సర్కారు ప్రకటించింది. గురువారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపీణీ సాగనున్నట్టు పేర్కొంది.
2017లో సర్కారు మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమం చేపట్టగా... బతుకమ్మ చీరల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు... నేతన్నలకు భరోసా కల్పించినట్టవుతోందని మంత్రి కేటీఆర్ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, నిఫ్ట్ డిజైనర్ల సహకారంతో సరికొత్త డిజైన్లలో ఈ ఏడాది తయారు చేయించామన్నారు. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డ్ కలిగిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు బతుకమ్మ చీరను అందించనున్నట్టు పేర్కొన్నారు.
ఇవీ చదవండి