Banks Refunded Excess Interest Collects from SHGs : రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా స్వయం సహాయక మహిళా సంఘాల నుంచి వసూలు చేసిన ఎక్కువ వడ్డీ మొత్తాన్ని బ్యాంకర్లు తిరిగి చెల్లించారు. రాష్ట్రంలోని రెండు లక్షలకు పైగా ఎస్‌హెచ్‌జీల ఖాతాల్లో 217 కోట్ల 61 లక్షల రూపాయలను బ్యాంకులు జమ చేశాయి. గత డిసెంబర్ 23వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈ విషయమై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.
ఆర్‌బీఐ నిబంధనల మేరకు వడ్డీ వసూలు చేయాలి : ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం మూడు లక్షల వరకు రుణాలకు గరిష్టంగా ఏడు శాతం, మూడు నుంచి ఐదు లక్షల వరకు పది శాతం వసూలు చేయాలని లేదా ఒక ఏడాది ఎంసీఎల్ఆర్‌లో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూలు చేయాలని మంత్రి హరీశ్‌రావు బ్యాంకర్లకు స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే వడ్డీ రేట్లు అమలు చేయాలన్న ఆయన... కొన్ని బ్యాంకులు ఎక్కువ వడ్డీని వసూలు చేసినట్లు తెలిపారు. దీంతో ఆయా మహిళా సంఘాల సభ్యులు అధిక వడ్డీ చెల్లించి నష్టపోతున్నారన్న హరీశ్‌రావు... ఖాతాలను పరిశీలించి ఎక్కువ వడ్డీ వసూలు చేసిన చోట ఆ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లించాలని ఆదేశించారు.
రేపు రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశం : రాష్ట్ర వ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి 217 కోట్ల 61 లక్షల రూపాయలను అధిక వడ్డీగా చెల్లించినట్లు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన ఆ మొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి బ్యాంకర్లు జమ చేశారు. దీంతో రెండు లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలకు లబ్ది చేకూరిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రేపు మరోసారి రాష్ట్ర బ్యాంకర్ల సమితి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్ రెడ్డి భేటీకానున్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాలు : మార్చి 8న మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మెప్మా, సెర్ప్ మహిళలకు ఈ రుణాలు అందిస్తామని పేర్కొన్నారు. 750 కోట్ల రూపాయల రుణాలు విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: