బ్యాంకులను మోసం చేసి, నిధులు మళ్లించి.. మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై లియో మెరిడియన్‌కు చెందిన ఇద్దరిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. లియోనియా రిసార్ట్స్ అధినేత, లియో మెరిడియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ప్రమోటర్ జీఎస్ సీ రాజు, ఆయన అనుచరుడు ఏవీ ప్రసాద్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ ఏడు రోజుల పాటు కస్టడీలో విచారణ జరిపేందుకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.
బ్యాంకులను మోసం చేసి సుమారు 1768 కోట్ల రూపాయల రుణాలు పొంది.. ఇతర వ్యాపారాలకు మళ్లించారని లియో మెరిడియన్ ప్రమోటర్లపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం గతంలో కేసు నమోదు చేసింది. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ దర్యాప్తు చేపట్టింది.
రిసార్ట్స్ అక్రమ లేఅవుట్ రూపొందించి... 315 ప్లాట్లను అమ్మి... వాటితో పాటు రోడ్లను మోసపూరితంగా తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు ఈడీ గుర్తించింది. రుణాలను డొల్ల కంపెనీల ద్వారా మళ్లీ తనకే మళ్లించుకొని... వాటి ఆధారంగా తిరిగి రుణాలు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు 33 డొల్ల కంపెనీలు, 40 బోగస్ కాంట్రాక్టర్లను గుర్తించింది. దాదాపు 250 కోట్ల 39 లక్షల రూపాయల స్థిర, చరాస్తులను అక్రమంగా కూడబెట్టుకున్నట్లు తేల్చిన ఈడీ... గతేడాది డిసెంబరు 30న తాత్కాలిక జప్తు చేసింది.