తెరాస ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గణేశ్ ఉత్సవాల నిర్వహణను తప్పుదారి పట్టిస్తోందని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రానికి స్పష్టత లేదని ఆరోపించారు.
క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్సవాల నిర్వహణకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తూ ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. స్పష్టత లేని రాష్ట్రపాలకులు, అధికారులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు.
ధార్మిక సంస్థలు, హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధానాలకు అనుగుణంగా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల పేరిట అధికారులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే తెరాస ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
కొవిడ్ నిబంధనల సాకుతో తెరాస నేతలు అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించాలని కోరారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న తెరాస ప్రభుత్వ చర్యలను భాజపా దీటుగా ఎదుర్కొంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా