కేటీఆర్‌ను భాజపా నేతలు కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం: బండి - telangana varthalu
రంగారెడ్డి భాజపా జిల్లా కమిటీ నేతలు కేటీఆర్‌ను కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయడానికి కేటీఆర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే అంశాలను తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని వేశామన్నారు.
హైదరాబాద్ లింగోజీగూడ డివిజన్ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయడానికి రంగారెడ్డి భాజపా జిల్లా కమిటీ నేతలు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే అంశాలను తెలుసుకోవడానికే నిజనిర్ధారణ కమిటీని వేసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తనకుగాని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే.అరుణ, మురళీధర్‌రావుకు సమాచారం ఇవ్వకుండా ఈ విషయాన్ని చర్చించకుండా కేటీఆర్‌ను ప్రత్యక్షంగా కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నేతలు తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా రాష్ట్ర నాయకత్వం భావిస్తోందని తెలిపారు. జరిగిన సంఘటన పట్ల పూర్తిస్థాయిలో విచారణ జరపాలనే ఉద్దేశంతోనే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
ఈ సంఘటన తర్వాత కొన్ని పత్రికలు, ప్రచార సాధనాలు, వెబ్ ఛానళ్లలో భాజపా సీనియర్ నాయకులపై తప్పుడు కథనాలను ప్రసారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో, వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. ఈ కథనాలన్నీ ఊహాజనితమైన అభూతకల్పనలేనన్నారు. ఈ తప్పుడు కథనాలతో పాటు జరిగిన విషయాలపై సమగ్ర విచారణ జరుగుతుందని.. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పార్టీకి నష్టం చేస్తే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.