Bandi sanjay fire on Trs: ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున కార్‌రేస్ ట్రయల్స్ నిర్వహిస్తూ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల నగర ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నారని మండిపడ్డారు.
అత్యవసరమైన అంబులెన్స్ సర్వీసులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్ రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియెట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు పరిసరాలన్నీ పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయా రోడ్లన్నీ బ్లాక్ చేయడం వల్ల ఏర్పడిన ట్రాఫిక్ సమస్యకు ప్రజల ప్రాణాలకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.
ఇలాంటి రేసులు పెట్టడానికి భాజపా వ్యతిరేకం కాదని.. నగర ప్రజల ట్రాఫిక్ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ పెట్టాలనేది ఆలోచించాలని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు నగర శివారులో వేలాది ఎకరాలు కబ్జా చేశారు. ఆ స్థలాల్లో ఇలాంటి రేసులు నిర్వహించుకోవచ్చన్నారు. అలా కాకుండా నగరం నడిబొడ్డున నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడమెంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: