Praja Sangrama Yatra: ప్రజా సమస్యలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజుతో ముగియనుంది. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 10 రోజుల పాటు యాత్ర కొనసాగింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్‌తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో యాత్ర సాగింది.
మూడు విడతల పాటు జిల్లాల్లో యాత్ర చేసిన సంజయ్.. నాలుగో దశను పట్టణ ప్రాంతంలో చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 115.3 కిలోమీటర్ల మేర నడిచారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరిస్తూ ముందుకు సాగారు. ఇప్పటి వరకు 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రజా సంగ్రామ యాత్ర పూర్తైంది. ఇందులో భాగంగా సంజయ్ నిత్యం సగటున 11 కిలోమీటర్ల మేర యాత్రను కొనసాగించారు.
గతంలో రోజుకు సుమారుగా 15 కిలోమీటర్లకుపైగా నడిచారు. మహానగరంలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనతో.. అన్ని వర్గాల ప్రజలను కలవాలని కిలోమీటర్ల సంఖ్య కుదించుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. పది రోజుల పాటు విజయవంతంగా సాగిన పాదయాత్ర పెద్ద అంబర్‌పేట సమీపంలో ముగుస్తోంది. ఈ సందర్భంగా అక్కడే భారీ బహిరంగ సభకు భాజపా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది.
సాయంత్రం 4 గంటలకు సభ జరగనుండగా.. కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభా వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు. సభాస్థలిలో ఏర్పాట్లను మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డి, పాదయాత్ర ఇంఛార్జ్ మనోహర్ రెడ్డి పరిశీలించారు. సభకు పెద్దఎత్తున జన సమీకరణకు భాజపా శ్రేణులు ప్రణాళికలు రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ నుంచి భారీగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: Delhi Liquor Scam: తెరపైకి మరో పేరు.. రెండ్రోజులుగా వారిపై ఈడీ ప్రశ్నల వర్షం
స్కూల్‌ను గోదాముగా మార్చిన లిక్కర్ మాఫియా.. భారీగా విదేశీ మద్యం పట్టివేత