బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. షేక్‌పేటలో ఆయనకు భాజపా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ప్రభుత్వం చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పాతబస్తీకి మెట్రో వస్తే నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గెలిచిన అనంతరం మొట్టమొదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ ఆలయం ముందే ఏర్పాటు చేస్తామన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే ప్రజల కోసం, గోరక్షణ కోసం ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. అక్టోబర్ 2వరకు అందరూ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనాలని ఆయన సూచించారు.
పాతబస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలు ఎందుకు వస్తలేదో ఎంఐఎం, తెరాస పార్టీ నేతలు చెప్పాలి. పాతబస్తీకి ఆ మెట్రోరైలు వస్తే యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటది. పాతబస్తీని ఎంఐఎం పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుందో చెప్పాలి. పాతబస్తీలో అవే గల్లీలు, అవే కేఫ్‌లు కనిపిస్తున్నాయి తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎంఐఎం, తెరాస పట్టించుకునే పరిస్థితి లేదు. 2023లో గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. మొదటి బహిరంగ సభ అదే భాగ్యలక్ష్మీ దేవాలయం ముందు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: Bandi sanjay: రెండోరోజు సంజయ్ యాత్ర ప్రారంభం.. సాయంత్రం భారీ బహిరంగ సభ