2023లో భాజపా అధికారంలోకి వచ్చేందుకు యువ మోర్చా కార్యకర్తలు పని చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ భాజపా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ భేటీలో పాల్గొన్న బండి.. రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం జల్సా చేస్తోందని ఆరోపించారు. యువ మోర్చా చేపట్టబోయే కార్యాచరణ... చరిత్రలో నిలిచిపోయేలా రూపొందించాలని సూచించారు.
యువ మోర్చా ఉద్యమంతో కేసీఆర్కు వణుకు పుట్టాలని మండిపడ్డారు. సిద్ధాంతం కోసం పని చేస్తాం తప్ప.. కేసులకు భయపడమని ధ్వజమెత్తారు. దేశం గురించి ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదని అన్నారు. యువ మోర్చా కార్యకర్తలకు క్రమశిక్షణ, ఓపిక ముఖ్యమని తెలిపారు.
రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే.. భాజాపా అధికారంలోకి రావాలని వెల్లడించారు. 2023 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది తెరాస ప్రభుత్వమేనని ఆరోపించారు. ఉద్యోగాలు భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో మేధావులు తీసుకున్న నిర్ణయం బాధ కల్గించిందని అన్నారు. అనేక విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు, మౌలిక సదుపాయలు లేవని చెప్పారు.
నాగార్జున సాగర్ జనరల్ స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన ఘనత భాజపాకే దక్కుతుందని అన్నారు. అసెంబ్లీ నడపాలంటే కూడా ప్రభుత్వం యువ మోర్చాను చూసి భయపడుతోందని వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునే విధంగా ప్రజలను యువమోర్చా చైతన్యవంతం చేయాలని సూచించారు.