వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్‌లతో పాటు మరో 42 మంది కార్యకర్తలు, రామభక్తులకు బెయిల్ రావటంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా ఆరుగురు మహిళలను అక్రమంగా జైలుకు పంపారని.. మరో 38 మంది భాజపా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో నియంతృత్వం కొనసాగుతున్నా న్యాయం చేయటానికి కోర్టులున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అక్రమ అరెస్ట్‌లకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఎన్నడూ బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భాజపా వాళ్లను అరెస్ట్ చేయటానికి జైళ్లు చాలక పోతే.. ప్రగతి భవన్, ఫాంహౌజ్‌లను కూడా జైళ్లుగా మారుస్తారా అని ప్రశ్నించారు.
అవమానించే వ్యాఖ్యలు చేయటం సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా తెరాస వాళ్లకు ఫ్యాషనైపోయిందని దుయ్యబట్టారు. వరంగల్, పరకాలలో భాజపా నాయకులపై దాడులు, కార్యాలయాలు దగ్ధం చేయటాలు చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుందన్నారు. అక్రమ అరెస్టులు తప్పని అడిగిన పాపానికి పోలీసులు... ఉల్టా చోర్ కొత్వాల్ లాగా లాఠీలతో చితకబాదారని ఆయన అన్నారు. పోలీసులతో పాలన చేయాలి అనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని బండి సంజయ్ హెచ్చరించారు. భాజపా నాయకులపై, ఇళ్లపై, కార్యాలయాలపై దాడి చేసిన తెరాస గూండాలను కూడా అరెస్ట్ చేసి ఎందుకు జైళ్లలో పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'స్పైసెస్ పార్క్ డీపీఆర్ పూర్తి... రైతులకు శుభపరిణామం'